జగన్…అత్త సొమ్ము అల్లుడు దానం

ఎవరి సొమ్ము..ఎవరు ఎవరికి దానం చేస్తారు? అసలు దీన్నేమనాలి. సంక్షేమ పథకాల కొత్త పుంతలు అనాలా? లేక అత్త సొమ్ము అల్లుడు దానం అనే సామెత గుర్తు చేసుకోవాలా? ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కొత్త…

ఎవరి సొమ్ము..ఎవరు ఎవరికి దానం చేస్తారు? అసలు దీన్నేమనాలి. సంక్షేమ పథకాల కొత్త పుంతలు అనాలా? లేక అత్త సొమ్ము అల్లుడు దానం అనే సామెత గుర్తు చేసుకోవాలా? ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కొత్త ఆలోచన చేసింది.అదేంటీ అంటే ప్రయివేట్ లే అవుట్ లలో చిన్న శాతం భూమిని పేదల కోసం ప్రభుత్వానికి ఇవ్వాలి. దాన్ని ప్రభుత్వం ఉచిత ఇళ్ల స్థలాల కింద పేదలకు ఇస్తుంది.

వినడానికి ఇదే బాగానే వుంది. ఫ్రీ గా తీసుకునేవారికీ బాగానే వుంటుంది. కానీ వ్యాపారం చేసుకునేవారికి? లే అవుట్ ల్లో స్థలాలు కొనుక్కోవాలి అనుకునేవారికి? ఎలా వుంటుంది? లే అవుట్ లకు ఇప్పుడు నిబంధనలు ఎలా వున్నాయి? కొంత శాతం ఖాళీగా వుంచాలి. పార్క్ లు, కమ్యూనిటీ పర్పస్ కు కొంత స్థలం వదలాలి. రోడ్లు ఈ లెక్కన వుండాలి. ఫెసిలిటీస్ ఈ విధంగా వుండాలి. 

లే అవుట్ వేసే వాళ్లు ఈ ఖర్చులు, ఈ వృధాగా వదిలేసే భూముల ఖరీదు, లాభం అన్నీ కలిపి గజం ఇంత అని లెక్క కట్టి విక్రయిస్తారు. ఇప్పుడు కొత్తగా పేదల కోసం ప్రతి లే అవుట్ లో కొంత స్థలం వదిలేయాలి అంటే పరిస్థితి ఏమిటి? ఆ భారం ఎవరి మీద పడుతుంది.  లే అవుట్ ల్లో స్థలాల రేట్లు పెరిగిపోవా?

ఆ సంగతి అలా వుంచితే లే అవుట్ లను గేటెడ్ కమ్యూనిటీలుగా తయారు చేస్తారు. ఓ స్థాయి జనాలు అంతా తమ లెవెల్ తగిన లే అవుట్ ను ఎంచుకుని కొనుక్కుంటారు. ఇప్పుడు ప్రతి లే అవుట్ లో పేద జనాలు కూడా అక్కడే వుంటారు తమతో సమానంగా అంటే ఓ లెవెల్ జనాలు ఎందుకు కొంటారు? కొని భవిష్యత్ లో అన్నింటికీ వారితో కిందా మీదా అవుతూ వుండాలా? అనే ఆలోచన రాదా?

జనం అంతా సమానమే అని వాదించడానికి, సూక్తులు వల్లించడానికి బాగానే వుంటుంది. కానీ ప్రాక్టికాలిటీలోనే వస్తుంది సమస్య అంతా. సమస్యే లేదు, జగన్ తీసుకున్న నిర్ణయం ఆయనకు ఓట్లు అయితే రాబట్టవచ్చు కానీ, లే అవుట్ ల వ్యాపారాన్ని చాలా  గట్టి దెబ్బ తీస్తుంది. అందులో సందేహం లేదు. 

ఇదిలా వుంటే పోనీ కేవలం పేదలకు స్థలాలు ఇవ్వాలంటే భూమి దొరకడం లేదు అందుకే జగన్ ఈ ఆలోచన చేసి వుంటారు అనుకుందాం. అయితే ఇక్కడ పెట్టిన రెండు క్లాజ్ లు ఆ అనుమానం లేకుండా చేస్తున్నాయి. క్లాజ్ నెంబర్ వన్ ఏమిటంటే, లే అవుట్ లో భూమి ఇవ్వడం ఇష్టం లేకుంటే వేరే చోట అయినా ఇవ్వవచ్చు. ఇదీ బాగానే వుంది. గేటెడ్ కమ్యూనిటీ అట్మాస్ఫియర్ దెబ్బతినకుండా వుంటుంది అనుకోవచ్చు. కానీ రెండో క్లాజ్ వుంది. అదేంటంటే భూమి ఇవ్వలేకపోతే, దానికి సమానమైన విలువను నగదు గా ప్రభుత్వానికి చెల్లించవచ్చు.

అంటే ఆఖరికి ఏమయింది? పేదలకు స్థలాలు అనే పేరు చెప్పి లే అవుట్ లు కొనే జనం దగ్గర డబ్బులు లాక్కుంటున్నట్లు అయింది కదా? అప్పుడు జగన్ ఉద్దేశాన్ని తప్పు పట్టాల్సిందే.