బాలీవుడ్ స్టార్ కపుల్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లి సందడి మొదలైంది. నిన్ననే రాజస్థాన్ లోకి సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ రిసార్ట్ కు చేరుకున్నారు కత్రినా-విక్కీ. ఈరోజు నుంచి వీళ్ల పెళ్లి సందడి మొదలైంది. సాయంత్రం సంగీత్ ఉంది. 9వ తేదీని ఇద్దరూ పెళ్లితో ఒకటి కాబోతున్నారు.
ఇలా అంతా కోలాహలంగా జరుగుతున్న టైమ్ లో వీళ్ల పెళ్లిపై పోలీస్ కంప్లయింట్ నమోదైంది. రాజస్థాన్ కు చెందిన నేత్రబింద్ సింగ్ ఈ ఫిర్యాదు చేశారు. స్థానిక లీగల్ అధికారులకు కూడా అతడు ఫిర్యాదు చేశాడు. అయితే సంచలనం కోసం అతడు ఈ పని చేయలేదు. అతడి ఫిర్యాదులో అర్థముంది.
సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారాకు ఆనుకొని ప్రసిద్ధ దేవీ మాత ఆలయం ఉంది. ఆ ఆలయానికి వెళ్లాలంటే ఈ రిసార్ట్ ను దాటాల్సిందే. అయితే కత్రినా-విక్కీ పెళ్లిని దృష్టిలో పెట్టుకొని రిసార్ట్ నిర్వహకులు… ఆ దారిని బ్లాక్ చేశారు. దీంతో వందలాది మంది భక్తులు అసౌకర్యానికి గురవుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని లాయర్ నేత్రబింద్ సింగ్ ఈ ఫిర్యాదు చేశారు.
ఒకట్రెండు రోజులు ఆలయానికి దారి మూసేస్తే సరిపెట్టుకోవచ్చు. కానీ ఏకంగా 6వ తేదీ నుంచి ఆ దారి మూసేశారు. తిరిగి 12వ తేదీ సాయంత్రం తెరుస్తారట. స్వయంగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో, హోటల్ మేనేజ్ మెంంట్ ఈ దారి మూసేయడం సదరు లాయర్ కు నచ్చలేదు. ప్రతి రోజూ వందల సంఖ్యలో భక్తులు వచ్చే ఈ దారిని మూసేస్తే మనోభావాలు దెబ్బతింటాయని ఆయన వాదిస్తున్నారు. దీనిపై ఇప్పటికే సిక్స్ సెన్సెస్ ఫోర్టుకు నోటీసులు అందాయి.
మరోవైపు చాలామంది బాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు ఈ పెళ్లికి హాజరవుతున్నారు. ఈరోజు పొద్దున్నుంచే చాలామంది సెలబ్రిటీలు హోటల్ కు చేరుకుంటున్నారు. పెళ్లి తర్వాత విక్కీ-కత్రిన ఇదే హోటల్ లో మరో 2 రోజులు బస చేయబోతున్నారు.