అతడికి 27, ఆమెకు 35.. ఆ తర్వాత?

అక్రమ సంబంధం అనే మోటు పదానికి లివ్ ఇన్ రిలేషన్ అనే అందమైన పేరు పెట్టుకున్నారు. పేరేదైనా ఆ సంబంధంలో ఉండే తప్పొప్పులు మాత్రం మారవు. మోజు తీరిపోయాక, మొహం మొత్తాక లివ్ ఇన్…

అక్రమ సంబంధం అనే మోటు పదానికి లివ్ ఇన్ రిలేషన్ అనే అందమైన పేరు పెట్టుకున్నారు. పేరేదైనా ఆ సంబంధంలో ఉండే తప్పొప్పులు మాత్రం మారవు. మోజు తీరిపోయాక, మొహం మొత్తాక లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్న ఆడవారి పరిస్థితి ఘోరంగా తయారవుతోంది. వారిని వదిలించుకోడానికి ఏకంగా హత్యలకు సైతం వెనకాడ్డంలేదు. ఆమధ్య ఢిల్లీలో శ్రద్ధావాకర్ హత్య కేసు ఎంత సంచలనంగా మారిందో అందరికీ తెలుసు.

ఇప్పుడు అదే ఢిల్లీలో, అలాంటి ఘటనే, వాలంటైన్స్ డే రోజున బయటపడింది. తాజాగా ముంబైలో కూడా ఇలాంటి ఘోరం జరిగింది. ముంబై మెట్రోపాలిటన్ పరిధిలోని నలసోపర ప్రాంతంలో లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్న ఓ మహిళ హత్య వెలుగు చూసింది.

నలసోపర ప్రాంతంలో ఇటీవల ఓ అపార్ట్ మెంట్ లో భార్యాభర్తలంటూ ఇద్దరు అద్దెకు దిగారు. అతడి పేరు హార్దిక్ షా, వయసు 27, రాజస్థాన్ కి చెందిన వ్యక్తి. ఆమె పేరు ధన్ సింగ్ తోర్వి, వయసు 35 ఏళ్లు, కర్నాటక వాసి. వారిద్దరికీ పరిచయం ఎక్కడైందో తెలియదు కానీ ఇద్దరూ కలసి నలసోపర ప్రాంతంలో భార్యాభర్తలం అని చెప్పి అద్దెకు దిగారు. ఇరుగుపొరుగు వారికి కూడా అలాగే చెప్పారు.

కానీ వచ్చినప్పటినుంచి రోజూ గొడవలే. ఆ గొడవలు పెరిగి పెద్దవయ్యాయి. చివరకు తోర్విని హత్య చేశారు హార్దిక్ షా. ఆమెను బెడ్ కింద ఉండే అరలో పడేసి ఇంటికి తాళం వేసి రాజస్థాన్ వెళ్లిపోయాడు.

ఎలా తెలిసిందంటే..?

రాజస్థాన్ వెళ్లిపోయిన హార్దిక్ షా.. తోర్వి బంధువులకు ఫోన్ చేశాడు. తోర్విని తానే చంపేశానని, బెడ్ కింద పడేశానని, తనని అపరాధ భావం వెంటాడుతోందని, ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పాడు. వెంటనే వారు అలర్ట్ అయ్యారు. ఇంటి యజమానులకు ఫోన్ చేసి విషయం చెప్పారు. దీంతో వారు పోలీసులుకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి తలుపులు బద్దలుకొట్టారు. బెడ్ కింద దాచి ఉంచిన తోర్వి శవాన్ని బయటకు తీశారు. హంతకుడి కోసం రాజస్థాన్ లో గాలింపు చేపట్టారు. అతడు ఆత్మహత్య చేసుకోలేదు. వెంటనే పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు.

తనకంటే వయసులో పెద్దదైన మహిళను ప్రేమించానని చెప్పి సహజీవనం చేశాడు హార్దిక్ షా. చివరకు ఆమెపై మోజు తీరిపోయే సరికి వదిలించుకోవాలనుకున్నాడు. ఆమె వదిలి వెళ్లేలా లేకపోవడంతో చివరకు గొంతుకోసి హత్యచేశాడు.