ఏ సమయంలో, ఎవరి మనోభావాలు, ఎలా దెబ్బతింటాయో అస్సలు ఊహించలేని పరిస్థితి. అదే సమయంలో ఆ మనోభావాల విలువ ఆయా వర్గాలకే బాగా తెలుస్తుంది. అలాంటి వ్యవహారమే ఇప్పుడు ఏపీలో కొత్తగా తెరపైకి వచ్చింది.
చింతామణి నాటకాన్ని బ్యాన్ చేయాలంటూ ఇప్పుడు ఆర్యవైశ్య మహాసభ నాయకులు ఆందోళనకు సిద్ధమయ్యారు. వెంటనే ఈ నాటకాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు. చింతామణి నాటకం వందేళ్లు పూర్తి చేసుకోబోతున్న ఈ సందర్భంలో ఈ వివాదం తెరపైకి రావడం విశేషం.
చింతామణి నాటకం ఇప్పటిది కాదు. 1923లో కాళ్లకూరి నారాయణ రావు రచన అది. అప్పటి సామాజిక సమస్యల ఆధారంగా, వేశ్య వృత్తి అనే దురాచారాన్ని ఖండిస్తూ దీన్ని రూపొందించారు. తెలుగు తెలిసినవారు ఎక్కడుంటే అక్కడ ఈ నాటకాన్ని ప్రదర్శించేవారు.
దేశమంతా కూడా ఇది ఫేమస్ నాటకం. ఇందులో సుబ్బిశెట్టి అనేది హాస్య పాత్ర. ఆ తర్వాత చాలా సినిమాల్లో కూడా సుబ్బిశెట్టి తరహా పాత్రలు కనిపించేవి. భవాని శంకరుడనే బ్రాహ్మణ పాత్ర కూడా ఉంటుంది. అయితే బ్రాహ్మణ, వైశ్య పాత్రలు రెండూ నెగెటివ్ పాత్రలు, హాస్యపాత్రలే. దీనిపై ఇప్పుడు వైశ్య సంఘాలు భగ్గుమంటున్నాయి.
వైశ్యులతో ఎప్పుడూ కామెడీయేనా..?
చింతామణి నాటకం తమ సామాజిక వర్గాలను కించపరిచేలా ఉందనేది వైశ్యుల ప్రధాన ఆరోపణ. ఈ నాటకాన్ని తక్షణం నిషేధించాలని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను డిమాండ్ చేసింది.
వైశ్యులను, బ్రాహ్మణులను కించపరుస్తూ నాటకాలు ప్రదర్శిస్తుంటే వాటికి పోలీసులు రక్షణ ఇవ్వడం మరీ దారుణం అంటున్నారు. తమ జాతిని కించపరిచే ఈ నాటకానికి అడ్డుకట్ట వేయకపోతే రెండు రాష్ట్రాల్లో ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
మొత్తమ్మీద దాదాపు వందేళ్లకు చింతామణి నాటకం ఇలా తెరపైకి వచ్చింది. అప్పట్లో సామాజిక చైతన్యం కోసం ప్రదర్శించిన ఈ నాటకం.. ఇప్పుడు సామాజిక అంతరాలను పెంచుతోందని విమర్శిస్తున్నారు వైశ్య సంఘాల ప్రతినిధులు.