ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ఒక సామాజిక వర్గంలో వ్యతిరేకత నింపేందుకు టీడీపీ సరికొత్త నాటకానికి తెరలేపింది. ఇందుకు దివంగత రోశయ్య మరణాన్ని నిస్సిగ్గుగా వాడుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. రోశయ్య తుదిశ్వాస వరకూ కాంగ్రెస్ సైనికుడు. రాజకీయంగా చివరి శ్వాస వరకూ టీడీపీకి వ్యతిరేకంగా పని చేశారు. అలాంటి రోశయ్య కులాన్ని రాజకీయంగా టీడీపీ వాడుకునే ప్రయత్నాలపై రాజకీయ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి.
మాజీ ముఖ్యమంత్రి రోశయ్య చనిపోతే ఆయన పార్థివదేహాన్ని సందర్శించకుండా ఆర్యవైశ్యుల మనోభావాలను దెబ్బ తీశారని టీడీపీ కొత్త పల్లవి అందుకుంది. అంతటితో ఆ పార్టీ ఊరుకోలేదు. సొంత సామాజిక వర్గానికి చెందిన వారు చావులు, పెళ్లిళ్లకు మాత్రం జగన్ పరిగెత్తుకుని వెళ్తారనే దుష్ప్రచారానికి తెరలేపింది. ఇదే తమ అధినేత చంద్రబాబు ఎన్ని కార్యక్రమాలు ఉన్నా వెళ్లి రోశయ్యకు నివాళులర్పించారంటూ ఆర్యవైశ్యుల అభిమానాన్ని చూరగొనే ప్రయత్నం చేస్తోంది.
జగన్ తండ్రి వైఎస్సార్‌కు రోశయ్య మూడు దశాబ్దాల పాటు సన్నిహితంగా ఉన్నారని టీడీపీనే చెబుతోంది. రోశయ్య పార్థివదేహాన్ని చూడడానికి వెళ్లకపోగా కనీసం తాడేపల్లిలో రోశయ్య చిత్రపటానికి పూలమాల కూడా జగన్ వేయలేదంటూ ఆర్యవైశ్యుల్లో విషాన్ని నింపే ప్రయత్నం ఓ పథకం ప్రకారం జరుగుతోంది.
రాజశేఖరరెడ్డి చనిపోయిన తర్వాత ముఖ్యమంత్రి పదవి తనకు కాకుండా రోశయ్యకు వచ్చిందన్న కక్షతో జగన్ వ్యవహరిస్తున్నారని విమర్శించడం గమనార్హం. ఈ ప్రభుత్వ వైఖరిని ఆర్యవైశ్యులు గమనించాలని టీడీపీ విజ్ఞప్తి చేయడం వెనుక కుల రాజకీయం స్పష్టంగా కనిపిస్తోంది.
రోశయ్యను ఆర్యవైశ్యులు తమ కులపెద్దగా భావిస్తారు. ఆర్యవైశ్య సామాజిక వర్గంలో రోశయ్య స్థాయి నాయకులు లేరు. రోశయ్య అంటే ఆర్యవైశ్యులకు ఎంతో గౌరవాభిమానాలు. నిజానికి రోశయ్య అంతిమ నివాళి అర్పించడానికి జగన్ వెళ్లకపోవడంపై సొంత పార్టీలోనే కొంత వ్యతిరేకత వ్యక్తమైంది.
వైఎస్సార్‌కు అత్యంత సన్నిహితుడైన రోశయ్యకు తుది వీడ్కోలులో జగన్ పాల్గొని వుంటే బాగుండేదని శ్రేయోభిలాషుల అభిప్రాయం. ఎందుకనో ఆ పని జగన్ చేయలేదు. ఇదే అవకాశంగా టీడీపీ ఆర్యవైశ్యుల్లో జగన్‌పై వ్యతిరేకత, అలాగే తమపై సానుకూలత పెంచుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది.