ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను భయపెట్టి లొంగదీసుకోవాలనే కుయుక్తులు. జగన్ భయపడని స్వభావం తెలిసి కూడా అమరావతి పరిరక్షణ సమితి ముసుగులో టీడీపీ మరో రచ్చకు శ్రీకారం చుట్టింది. అది కూడా కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుని చెంత ఛీప్‌ట్రిక్స్‌కు పాల్పడడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎంతసేపూ వక్రమార్గంలో తమ పంతాన్ని, డిమాండ్లను సాధించుకోవాలనే ధోరణి అమరావతి పరిరక్షణ సమితిలో కనిపిస్తోంది. న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో చేపట్టిన పాదయాత్ర ముగింపు దశకు చేరింది.
ఇందులో భాగంగా తిరుపతిలో 17న భారీ బహిరంగ సభ నిర్వహించ తలపెట్టారు. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ స్టేడియంలో ముగింపు సభకు అనుమతి ఇవ్వాలని వీసీకి లేఖ రాసినా… ఇంత వరకూ అక్కడి నుంచి సమాధానం లేదు. తిరుపతిలో బహిరంగ సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దర్శన టికెట్లు లేనిదే శ్రీవారి దైవ దర్శనానికి అనుమతించరని పోలీసులు చెప్పారు. రైతుల కోసం శ్రీవారి దర్శనార్థమై రూ.300 టికెట్లు కేటాయించాలని ఈవోకు రాసిన లేఖపైనా ఇంతవరకూ సమాధానం లేదు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహాపాదయాత్ర చేపట్టినప్పుడు, అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలనే స్పృహ అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులకు లేదా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. పాదయాత్రకు మాత్రమే హైకోర్టు అనుమతి ఇచ్చింది. బహిరంగ సభకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు.
మరోవైపు శ్రీవారి దర్శనానికి పాసులు లేనిదే అనుమతించరనే విషయం తెలిసి కూడా, అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకోకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. చివరికి రైతులు స్వామి వారి దర్శనం చేసుకుందామనుకున్నా జగన్ ప్రభుత్వం అనుమతించలేదనే దుష్ప్రచారం చేసేందుకే కావాలని నిర్వాహకులు చిల్లర ఎత్తుగడ వేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బహిరంగ సభకు అనుమతి నిరాకరణ, అలాగే శ్రీవారి దర్శనానికి అడ్డంకుల పేరుతో ఎల్లో బ్యాచ్ మార్క్ రచ్చ చేయడానికి 10 రోజుల ముందు నుంచే ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్టు కనిపిస్తోంది. అమరావతి పరిరక్షణ సమితి పేరుతో టీడీపీ ఆడిస్తున్న డ్రామా ఎంత వరకు రక్తి కట్టిస్తుందో కాలమో జవాబు చెప్పాల్సి వుంది.