కాంగ్రెసోళ్ల జోస్యాలతో భారాస ఫుల్ ఖుషీ!

తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకు ‘రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే’ అని చెప్పుకోవడానికి ఆ పార్టీ పరిమితం అయిపోయింది. ‘సోనియమ్మ తన పుట్టిన రోజు కానుకగా.. మనకు తెలంగాణ రాష్ట్రాన్ని అందించారు’ అని…

తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకు ‘రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే’ అని చెప్పుకోవడానికి ఆ పార్టీ పరిమితం అయిపోయింది. ‘సోనియమ్మ తన పుట్టిన రోజు కానుకగా.. మనకు తెలంగాణ రాష్ట్రాన్ని అందించారు’ అని ఆమె భజనపరులందరూ కీర్తిస్తూ గడిపేస్తుంటారు. వారు ఆ మాటలు చెప్పుకుంటూ బతికేయడం తప్ప రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు ఇంకో తెరువు ఉన్నట్టుగా కనిపించదు. 

సోనియమ్మ ఔదార్యంతో తెలంగాణ ఏర్పడిందని చరిత్ర పుస్తకాల్లో వారు రాసుకోవాల్సిందే తప్ప.. ఈ రాష్ట్రంలో వారు మళ్లీ నిలదొక్కుకునేలా మాత్రం లేరు. వారు ఎన్ని మాటలు చెప్పినప్పటికీ.. ఏదో ఒకనాటికి మళ్లీ అధికారంలోకి రాగలిగేలా ప్రజలు వారిని ఆదరించడం లేదు. అసలే ముక్కిడి ఆపై పడిశం అన్న సామెత చందంగా.. అసలే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి జనంలో నమ్మకం అంతంత మాత్రంగా ఉంటే.. తాజాగా సీనియర్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు.. ఆ పార్టీకి మరింతగా సమాధి కట్టేలా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ క్రెడిబిలిటీకి పాతర వేస్తున్నాయి. 

ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల తర్వాత.. కాంగ్రెస్, భారాసలతో కూడిన హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని ప్రకటించడం ద్వారా కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక బాంబు పేల్చారు. 

తాజా తెలంగాణ రాజకీయాలన్నీ ఈ మాట చుట్టూనే తిరుగుతున్నాయి. తెలంగాణలో ఈ ఎన్నికల్లో ఏ పార్టీ కూడా అధికారం చేపట్టడానికి అవసరమైన సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించే అవకాశం లేదు. 60 సీట్లు ఏ ఒక్క పార్టీకీ రావు. అలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ తో కలిసి, భారాస హంగ్ ప్రభుత్వం ఏర్పాటుచేస్తుంది అని కోమటిరెడ్డి జోస్యం చెప్పారు. చాలా మంది కాంగ్రెస్ నాయకులు ఈ ప్రకటనను ఖండిస్తున్నారు. 

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఇన్చార్జి మాణిక్యం ఠాక్రే లాంటి వాళ్లు మాత్రం.. తాము ఆ ప్రకటన చూడలేదని తర్వాత స్పందిస్తామని, రాహుల్ వరంగల్ సభలో చేసిన ప్రకటన ప్రకారమే పార్టీ వ్యూహం ఉంటుందని అంటున్నారు. అదే సమయంలో వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి లాంటి వాళ్లు.. ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓ యాభై స్థానాలు వచ్చాయనుకోండి, భారాసకు మరికొన్ని స్థానాలు వచ్చాయనుకోండి.. అప్పుడు ఏమవుతుంది. భారాస వెళ్లి మతతత్వ పార్టీతో బిజెపితో కలవదు కదా.. కాంగ్రెస్ వెళ్లి బిజెపితో కలవదు కదా.. అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అన్యాపదేశంగా కాంగ్రెస్, భారాస హంగ్ సర్కారు తప్పదనే జోస్యమే చెబుతున్నారు. 

అయితే ఈ జోస్యాలు కాంగ్రెస్ పార్టీకి మరణశాసనం లిఖిస్తున్నాయని చెప్పాల్సిందే. ఎందుకంటే.. గత ఎన్నికల్లో గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు అధికార భారాస పార్టీలోకి వలస వెళ్లారు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే  అది తిరిగి భారాసకు వెళ్లిపోతుందని ప్రజల్లో ఒక అభిప్రాయం పాతుకుపోయింది. అసలే వాతావరణం అలా ఉండగా.. తాజాగా ఈ నాయకుల జోస్యాలు ప్రజలకు మరింత అపనమ్మకం కలిగించడం మాత్రమే కాదు.. కాంగ్రెస్ విజయావకాశాల్నీ దారుణంగా దెబ్బతీస్తాయి.