చంద్రబాబునాయుడు తీసుకొచ్చిన జోష్ కాస్త లోకేశ్ పాదయాత్రతో హుష్‌మని పోయిందనే ఆవేదన టీడీపీకి నిద్రలేని రాత్రుల్ని మిగిల్చింది. మహానాడు, బాదుడే బాదుడే, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాలు చంద్రబాబు నేతృత్వంలో సాగాయి. వీటికి జనం వెల్లువెత్తారు. దీంతో అధికారంపై టీడీపీలో ఆశలు చిగురించాయి. తన సభలకు రెట్టించిన ఉత్సాహం వస్తున్న ప్రజానీకాన్ని చూసి చంద్రబాబులో నూతనోత్సాహం కనిపించింది.
చంద్రబాబు సభలకు జనం భారీ సంఖ్యలో రావడంతో టీడీపీలో భవిష్యత్‌పై భరోసా కనిపించింది. వైసీపీలో ఆందోళన రేకెత్తించింది. చంద్రబాబుతోనే కార్యక్రమాల్ని కొనసాగించి వుంటే… వైసీపీకి సినిమా కనిపించేది. అయితే కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడనే సామెత చందాన… వైసీపీకి కలిసొచ్చే కాలానికి లోకేశ్ నడిచొచ్చాడు. ఎప్పుడైతే కుప్పం కేంద్రంగా యువగళం పేరుతో లోకేశ్ పాదయాత్ర మొదలు పెట్టాడో, ఆ క్షణాన్నే టీడీపీకి బ్యాడ్ టైమ్, వైసీపీకి గుడ్ టైమ్ మొదలైంది.
బాబు సభలకు జనం పెద్ద ఎత్తున వెళుతుండడంతో మళ్లీ టీడీపీ గాలి వీస్తోందన్న భయం వైసీపీలో కనిపించింది. అయితే లోకేశ్ పాదయాత్ర పుణ్యమా అని వైసీపీలో భవిష్యత్‌పై భయం పోయింది. లోకేశ్ పాదయాత్రకు జనం రాకపోవడంతో టీడీపీకి అంత సీన్ లేదని వైసీపీ అంటోంది. ఈ దఫా మళ్లీ మనదే అధికారం అనే ధీమాను లోకేశ్ పాదయాత్ర వైసీపీలో నింపింది.
లోకేశ్ పాదయాత్ర బుధవారానికి 20వ రోజుకు చేరింది. యువగళం పాదయాత్ర షో అట్టర్ ప్లాప్ అనే పేరు తెచ్చుకుంది. లోకేశ్ నడిచేకొద్ది వైసీపీలో అధికారంపై భరోసా అంతకంతకూ పెరుగుతోంది. పాదయాత్రలో లోకేశ్‌ను పట్టించుకునే సీన్ లేదని తేలిపోయింది. అప్పుడప్పుడు ప్రభుత్వమే దయతలచి లోకేశ్ పాదయాత్రకు ప్రచారం కల్పిస్తోంది. మైక్ లాక్కోవడం, చివరికి ఆయన నిలిచి మాట్లాడ్డానికి స్టూల్ కూడా లేకుండా చేయడం తదితర చర్యలు లోకేశ్‌పై సానుభూతి కలిగిస్తున్నాయి.
లోకేశ్ పాదయాత్ర వల్ల గత కొన్ని నెలలుగా తెచ్చుకున్న పాజిటివిటీ అంతా పోయిందని టీడీపీ నేతలు, కార్యకర్తలు నెత్తీనోరు కొట్టుకుంటున్నారు. చంద్రబాబు కుమారుడిగా లోకేశ్‌కు జనం బ్రహ్మరథం పడతారని టీడీపీ భావించింది. తీరా నడక మొదలైన తర్వాత గానీ, తత్వం బోధపడింది. మరీ ఇంత అధ్వానంగా లోకేశ్ పాదయాత్రకు నిరాదరణ ఎదురవుతుందని అసలు అంచనా వేయలేదని టీడీపీ నేతలు వాపోతున్నారు.
ఇదే చంద్రబాబు సభలకు జనం స్వచ్ఛందంగా వచ్చారని, ఇప్పుడు లోకేశ్‌కు ఎందుకు రావడం లేదో అర్థం కావడం లేదని పార్టీ శ్రేణులు తమకు తాము ప్రశ్నించుకుంటున్న పరిస్థితి. ఇదే రీతిలో లోకేశ్ పాదయాత్ర కొనసాగితే… టీడీపీకి మరింత డ్యామేజీ తప్పదనే ఆందోళన టీడీపీలో కనిపిస్తోంది.