మాజీ మంత్రి మహిళా మంత్రి గుమ్మడి కుతూహలమ్మ (73) ఇవాళ ఉదయం అనారోగ్యంతో మృతి చెందారు. ఇటీవల మోకాళ్ల ఆపరేషన్ చేయించుకున్నారు. అనంతరం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీనికి తోడు ఫాంక్రియాస్ సమస్యతో బాధపడుతూ… తిరుపతిలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. సుదీర్ఘ కాలం పాటు తెలుగు రాజకీయాల్లో ఆమె కొనసాగారు.
వృత్తిరీత్యా డాక్టర్ అయిన కుతూహలమ్మ రాజకీయాల్లోకి వచ్చారు. చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్‌గా రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెట్టారు. 1985లో ఎన్టీఆర్ హవాలో ఆమె వేపంజేరి (ఇప్పుడు గంగాధర నెల్లూరు) నుంచి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలుపొంది చట్ట సభలో అడుగు పెట్టారు. అదే నియోజకవర్గం నుంచి 1989, 1999, 2004లలో ఆమె విజయం సాధించారు. అయితే 1994లో ఆమెకు కాంగ్రెస్ పార్టీ టికెట్ నిరాకరించడంతో ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచి ఓటమిపాలయ్యారు. 2009లో నియోజక వర్గాల పునర్విభజనలో వేపంజేరి కాస్త జీడీనెల్లూరుగా అవతరించింది. 2009లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరపున ఆమె విజయం సాధించారు.
దివంగత ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి కేబినెట్‌లో ఆమె వైద్యారోగ్యం, శిశుసంక్షేమ శాఖ మంత్రి పదవి దక్కించుకున్నారు. వైఎస్సార్ హయాంలో 2007లో ఆమె ఉమ్మడి ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో రాజకీయ సమీకరణలు మారాయి. టీడీపీలో గుమ్మడి కుతూహలమ్మ చేరారు. జీడీనెల్లూరు నుంచి టీడీపీ తరపు బరిలో నిలిచి వైసీపీ అభ్యర్థి నారాయణస్వామి చేతిలో పరాజయం పాలయ్యారు. అప్పటి నుంచి ఆమె క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
2019లో ఆమె కుమారుడు హరికృష్ణ టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఏడాదిన్నర క్రితం తల్లితనయుడు టీడీపీకి రాజీనామా చేశారు. ఏ పార్టీలోనూ లేరు. ఆమె మృతికి రాజకీయాలకు అతీతంగా నివాళులర్పిస్తున్నారు.