అలవిమాలిన ఆశలో పొత్తులు గుర్తుకు రాలేదు!

కాస్త విద్యావంతుల్లో తమ పార్టీకి అసాధారణమైన ఆదరణ ఉంటుందని వారికి అహంకారంతో కూడిన ఒక నమ్మకం ఉంది. చదువుకున్న వర్గానికి చెందిన ప్రజలు తమ పార్టీకి పట్టం కడతారని, చదువు సంధ్యా లేకుండా ఓట్లు…

కాస్త విద్యావంతుల్లో తమ పార్టీకి అసాధారణమైన ఆదరణ ఉంటుందని వారికి అహంకారంతో కూడిన ఒక నమ్మకం ఉంది. చదువుకున్న వర్గానికి చెందిన ప్రజలు తమ పార్టీకి పట్టం కడతారని, చదువు సంధ్యా లేకుండా ఓట్లు అమ్ముకునే వాళ్ళు మాత్రమే గెలిచే పార్టీలకు వేస్తుంటారని ఏపీలో వారి అభిప్రాయం. అందుకే ఇప్పుడు పట్టభద్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల వాతావరణం ముంచుకు వచ్చిన నేపథ్యంలో.. మొత్తం మూడు స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించారు. ఈ ఎన్నికలలో తమకు అడ్వాంటేజీ ఉంటుందనే నమ్మకంతో పొత్తు ధర్మాన్ని కూడా వారు పట్టించుకోలేదు. వారు మరెవరో కాదు, కేంద్రంలో మోడీ బొమ్మను చూపించి రాష్ట్రానికి తమ పార్టీ ఎంత ద్రోహం చేస్తున్నా సరే.. ఇక్కడ సీట్లు గెలవాలని ఆశలు పెంచుకుంటున్న బిజెపి నాయకులు!

పట్టభద్ర, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు గంట మోగిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ  మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అయితే పొత్తు ధర్మాన్ని పాటించి జనసేనకు ఒక్క సీటు కూడా కేటాయించకపోవడం ఆశ్చర్యంగా కనిపిస్తోంది.

పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని ప్రకటన చేసే ప్రతి సందర్భంలోనూ.. ఆ వెంటనే బిజెపి నాయకులు తెరమీదకు వస్తుంటారు. ఆ పార్టీ నాయకులు తక్షణం ఒక ప్రెస్ మీట్ పెట్టి.. తాము జనసేన పార్టీతో పొత్తులు కొనసాగిస్తున్నామని, వచ్చే ఎన్నికలలో తమ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని, తమ మధ్య పొత్తు బంధం చాలా గట్టిగా ఉన్నదని చెబుతూ ఉంటారు. 

అయితే ఇప్పుడు మూడు ఎమ్మెల్సీ స్థానాలుకు అభ్యర్థులను ఏకపక్షంగా ప్రకటించేసిన నేపథ్యంలో- బిజెపి ఎంత మేరకు జనసేనతో ఉన్న పొత్తు ధర్మాన్ని గమనిస్తూ ఉన్నది అనేది ముఖ్యం.

తమ పార్టీ పోటీచేస్తే తెలుగుదేశానికి వచ్చే ఆ కాసిని ఓట్లు కూడా ఎక్కడ రాకుండా పోతాయో అని జనసేనానికి భయం. నిజానికి, నిజాయితీతో కూడిన చిత్తశుద్ధి గల రాజకీయాలను తాను రాష్ట్రానికి పరిచయం చేస్తానన్నట్లుగా బీరాలు పలుకుతూ ఉండే పవన్ కల్యాణ్.. ఇలాంటి ఎన్నికలను సద్వినియోగంచేసుకోవాలి. తాను చెప్పే విలువలు, నిజాయితీ వంటి పదాలకు చదువుకున్న వాళ్లలో ఆదరణ ఉంటుందనే నమ్మకంతో తన పార్టీని పోటీకి దించాలి. 

కనీసం.. ఆ వర్గం ఓటర్లలో ఆయనకు ఎంత శాతం ఓటు బ్యాంకు ఉన్నదో అర్థమవుతుంది. కానీ పవన్ కల్యాణ్ నుంచి అలాంటి ప్రయత్నమే జరగకపోగా.. పొత్తుల్లో ఉన్న బిజెపి ఏకపక్షంగా మూడు సీట్లకు అభ్యర్థులను ప్రకటించేయడమే చిత్రంగా ఉంది.