ఈరోజు సుప్రీంకోర్టు ముందుకు సజ్జనార్

దిశ హత్యకేసుకు సంబంధించి జరిగిన ఎన్ కౌంటర్ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది.ఈ ఘటనపై సర్వోన్నత న్యాయస్థానంలో రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు (పిల్) దాఖలయ్యాయి.ఈ రెండింటినీ సంయుక్తంగా విచారణకు స్వీకరించింది కోర్టు.దీనికి సంబంధించి వివరాలు అందించేందుకు,…

దిశ హత్యకేసుకు సంబంధించి జరిగిన ఎన్ కౌంటర్ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది.ఈ ఘటనపై సర్వోన్నత న్యాయస్థానంలో రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు (పిల్) దాఖలయ్యాయి.ఈ రెండింటినీ సంయుక్తంగా విచారణకు స్వీకరించింది కోర్టు.దీనికి సంబంధించి వివరాలు అందించేందుకు, సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఢిల్లీకి వెళ్లారు.

నిన్ననే ఢిల్లీకి చేరుకున్న సజ్జనార్,ఎన్ కౌంటర్ కు సంబంధించిన ఆధారాలు,వివరాలతో లాయర్ ను సంప్రదించారు.సీన్-రీక్రియేషన్ లో భాగంగా నిందితుల్ని ఘటనా స్థలానికి తీసుకెళ్లినప్పుడు..హఠాత్తుగా వాళ్లు తిరగబడ్డారని కర్రలు,రాళ్లతో దాడిచేయడంతో పాటు ఒక దశలో పోలీసుల వద్ద ఉన్న తుపాకీ తీసుకొని కాల్పులు చేసే ప్రయత్నం చేశారని పోలీసులు చెబుతున్నారు.తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఎదురుకాల్పులు జరిపామని చెబుతున్నారు.

ఈ వివరాలతో పాటు పోస్టుమార్టమ్ కు సంబంధించిన ప్రాధమిక సమాచారాన్ని కూడా ఈరోజు కోర్టుకు సమర్పించబోతున్నారు సజ్జనార్ తరఫు న్యాయవాది. ఎక్కడా చట్టాన్ని ఉల్లంఘించలేదని, రూల్స్ అతిక్రమించలేదని గట్టిగా చెప్పే ప్రయత్నం చేయబోతున్నారు.

కేసు సుప్రీంకోర్టుకు చేరడంతో ఎన్ కౌంటర్ మృతదేహాల అప్పగింత వ్యవహారం మరింత సంక్లిష్టంగా మారింది. మృతదేహాల్ని శుక్రవారం వరకు భద్రపరచాల్సిందిగా ఇప్పటికే తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.ఈ  ఆదేశాల్ని మరింత పొడిగిస్తూ సుప్రీంకోర్టు ఈరోజు కొత్తగా ఆదేశాలిచ్చే అవకాశం ఉంది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు నుంచి ఏదో ఒక విషయం బయటకు రానుంది.