పాపం కేఏ పాల్.ఏదో లోకానికంతటికి శాంతి చేకూర్చుదామనే లక్ష్యంతో ప్రజాశాంతి పార్టీ పెట్టాడు.అలాంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కేఏ పాల్ జీవితంలో శాంతి లేకపోవడమా?ఇది కలా,నిజమా?పచ్చి నిజమే.ఆయన జీవితంలో శాంతి కరువైంది.దీంతో ఆయన ప్రజలను ప్రశాంతంగా బతకనివ్వడం లేదు.ఎక్కడో అమెరికాలో ఉన్న పాల్…స్కైప్ ద్వారా హైదరాబాద్ జర్నలిస్టులతో మాట్లాడి తన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
కేఏ పాల్ జీవితంలో శాంతిని,ఆయన ప్రియమిత్రుడు దర్శకుడు రాంగోపాల్‌వర్మ పారదోలాడు.నిజానికి స్నేహితులు, సోదరులు లాంటి బంధాలను ఇష్టపడని వర్మ…ఎందుకనో పాల్ విషయంలో మాత్రం తన మనస్తత్వానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడు.తన ప్రియమైన మిత్రుడిపై అమ్మరాజ్యంలో కడప బిడ్డలు సినిమాలో ఓ పాట పెట్టాడు.అంతేకాదు ఆయనకు సంబంధించిన చిత్రాలను కూడా ఆ పాటలో ప్రదర్శించడంతో వివాదం మొదలైంది.
నేనే కేఏ పాల్, నేనే కేఏ పాల్ అంటూ మొదలయ్యే పాటలో వివిధ సందర్భాల్లో పాల్ హావభావాలను సినిమాలో పెట్టారు.పిల్లికి చెలగాటం,ఎలుకకు ప్రాణసంకటం చందాన…కేఏ పాల్ విలవిలలాడుతుంటే,ఆర్జీవీ మాత్రం హాయిగా కామెడీ చేస్తున్నాడు.ఆ సినిమా విడుదల ఆపాలంటూ ఆయన అమెరికా నుంచి డిమాండ్ చేస్తున్నాడు.తినబోతు రుచి చూడడం ఎందుకు…మరో 24 గంటల్లో సినిమా విడుదలవుతోంది.అందులో ఎవరెవరి గురించి ఏముందో తేలిపోతుంది కదా!