ఒకప్పుడు 'చెప్పను బ్రదర్..' అన్నాడు బన్నీ. ఇప్పుడు అతడి ఫ్యాన్స్ 'వద్దు బ్రదర్' అంటున్నారు. ఈ రెండు డైలాగ్స్ మధ్య లింక్ లేకపోయినా, గతంలో బన్నీ చెప్పిన డైలాగ్ నే కాస్త మార్చి ఇలా అతడికి రివర్స్ లో ట్యాగ్ చేస్తున్నారు అభిమానులు. దీనంతటికి కారణం ఓ బాలీవుడ్ సినిమా.
రీసెంట్ గా పఠాన్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన షారూక్, తన నెక్ట్స్ మూవీని అట్లీ దర్శకత్వంలో చేస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ అంచనాలకు తగ్గట్టు, సినిమాకు పాన్ ఇండియా అప్పీల్ ఇచ్చేందుకు షారూక్ ప్రయత్నిస్తున్నాడు.
ఇందులో భాగంగా జవాన్ సినిమాలో తమిళ స్టార్ హీరో విజయ్ ను ఓ కీలక పాత్ర కోసం తీసుకోవాలని అనుకున్నారు. కానీ అది సాధ్యం కాలేదు. దీంతో ఇప్పుడా కీలక పాత్ర కోసం టాలీవుడ్ నుంచి అల్లు అర్జున్ ను ట్రై చేస్తున్నారనే ప్రచారం నిన్నట్నుంచి ఊపందుకుంది.
ఎప్పుడైతే ఈ ప్రచారం మొదలైందో, అప్పట్నుంచి బన్నీ ఆర్మీ సోషల్ మీడియాలో హంగామా షూరూ చేసింది. బన్నీ బాలీవుడ్ డెబ్యూ అంటూ కొందరు సంతోషం వ్యక్తం చేయగా, చాలామంది ఫ్యాన్స్ మాత్రం జవాన్ సినిమాలో నటించొద్దంటూ అల్లు అర్జున్ కు సలహాలిస్తున్నారు. దీనికి వాళ్లు చెప్పే లాజిక్స్ కూడా సహేతుకంగానే ఉన్నాయి.
పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు అల్లు అర్జున్. త్వరలోనే పుష్ప-2తో ఆ క్రేజ్ ను కొనసాగించబోతున్నాడు. ఇలాంటి టైమ్ లో షారూక్ సినిమాలో ఓ చిన్న పాత్ర పోషించే బదులు, నేరుగా బాలీవుడ్ లో హీరోగా ఓ సినిమా చేయమని బన్నీకి సలహాలిస్తున్నారు.
ఏదేమైనా ప్రస్తుతానికి ఇదంతా ఊహాగానం మాత్రమే. జవాన్ మేకర్స్ నిజంగానే బన్నీని సంప్రదించారా లేదా అనే విషయాన్ని పక్కనపెడితే.. “వద్దు బ్రదర్” అంటూ అల్లు అర్జున్ ఆర్మీ చేస్తున్న హడావుడి మాత్రం ఓ రేంజ్ లో ఉంది.