'ఢిల్లీలో వాయు కాలుష్యం, నీటి కాలుష్యం చంపేస్తుంటే.. మళ్లీ మాకు ఉరెందుకు..' అంటూ సుప్రీం కోర్టును ప్రశ్నించాడట నిర్భయ హంతకుల్లో ఒకడైన అక్షయ్ సింగ్. ఏడేళ్ల కిందట అత్యంత కిరాతకంగా నిర్భయను చంపిన వాళ్లలో వీడూ ఒకడు. ఇన్నేళ్లూ జైల్లోనే ఉన్నాడు. వీడికి ఉరే సరి అని తీర్పు వచ్చింది.
అతి త్వరలో వీరికి ఉరి శిక్ష అమలు కానుందని వార్తలు వస్తున్నాయి. ఇన్నాళ్లూ వీళ్లంతా తాపీగా జైల్లో ఉన్నారు. అయితే దిశ పై జరిగిన ఘాతుకం నేపథ్యంలో అత్యాచారాలపై దేశ వ్యాప్తంగా నిరసన వెళ్లువెత్తుతూ ఉంది. ఈ పరిణామాల్లో నిర్భయ హంతకులకు ఇప్పటి వరకూ శిక్ష అమలు కాని వైనం చర్చనీయాంశంగా నిలిచింది. దిశ బలైతే కానీ, నిర్భయ హంతకుల గురించి ఈ వ్యవస్థకు గుర్తుకు రాలేదు!
ఎట్టకేలకూ వారి ఉరికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయనే వార్తల నేపథ్యంలో ఆ హంతకుల్లో భయం మొదలైనట్టుగా ఉంది. తమకు ఉరి శిక్షను విధించవద్దంటూ ఇప్పుడు రివ్యూ పిటిషన్లు దాఖలు చేస్తూ ఉన్నారు. ఆ రివ్యూ పిటిషన్లో కూడా అక్షయ్ సింగ్ అనే ఆ దుర్మార్గుడు వ్యంగ్యాన్ని వ్యక్తం చేశాడు.
నీటి కాలుష్యం, గాలి కాలుష్యం చంపేస్తోందని.. అలాంటప్పుడు తమను ప్రత్యేకంగా ఉరి తీయాల్సిన అవసరం ఏముందని వాడు ప్రశ్నించాడు. ఇన్నాళ్లు జైల్లో ఉన్నా వీరిలో ఏ మాత్రం పరివర్తన వచ్చిందో అర్థం చేసుకోవడానికి వాడు దాఖలు చేసిన రివ్యూ పిటిషనే తార్కాణం. చేసిన ఘాతుకం పట్ల పశ్చాతాపం వ్యక్తం చేస్తూ తమను క్షమించమని ఇప్పుడు కూడా కోరడం లేదు. తమ పైత్యాన్ని ప్రదర్శిస్తూ క్షమాభిక్షను కోరాడు అక్షయ్ సింగ్ అనే వాడు. వీళ్లు క్షమాభిక్షకు ఏ మాత్రం అర్హులేనా?