ముంబై టెస్టులో టీమిండియా భారీ విజయాన్ని నమోదు చేసింది. పరుగుల వారీగా చూస్తే.. భారత క్రికెట్ జట్టుకు ఇది అత్యంత ఘన విజయం. 372 పరుగుల తేడాతో ఈ మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. ఇది వరకూ ఆరేళ్ల కిందట దక్షిణాఫ్రికాపై సాధించిన 337 పరుగుల తేడాతో విజయమే అతి పెద్దది కాగా, ఇప్పుడు పాత రికార్డును సవరించింది టీమిండియా.
న్యూజిలాండ్ ముందు ఐదు వందలకుపైగా లక్ష్యాన్ని నిర్దేశించింది టీమిండియా. అయితే ఆ జట్టు 167 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో 372 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించినట్టైంది. మూడో రోజు ముగిసే సమయానికి ఐదు వికెట్లను కోల్పోయి 140 పరుగులను చేసిన కివీస్ నాలుగో రోజు కేవలం ఇరవై ఏడు పరుగులను జోడించి మిగిలిన ఐదు వికెట్లనూ కోల్పోవడం గమనార్హం.
ఈ మ్యాచ్ లో విజయంతో రెండు టెస్టుల సీరిస్ ను ఇండియా ఒక్క మ్యాచ్ విజయంతో నెగ్గింది. తొలి టెస్టును న్యూజిలాండ్ డ్రా చేసుకుంది. చివరి వికెట్ ను నిలబెట్టుకుని తొలి మ్యాచ్ ను డ్రా చేసుకుని పరువు నిలుపుకున్న న్యూజిలాండ్ రెండో టెస్టులో మాత్రం పూర్తిగా చేతులెత్తేసింది. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ బౌలర్ అజాజ్ పటేల్ తొలి ఇన్నింగ్స్ లో పదికి పది వికెట్ల ను సాధించి అరుదైన ఫీట్ ను సాధించినా, తొలి ఇన్నింగ్స్ లో అరవై రెండు పరుగులకే ఆలౌట్ అయ్యి మ్యాచ్ ను పూర్తిగా ఇండియాకు అప్పగించింది కివీస్ జట్టు.
ఫాలో ఆన్ ఆడించే అవకాశం ఉన్నా.. టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ తీసుకున్నాడు. త్వరలోనే సౌతాఫ్రికా పర్యటన నేపథ్యంలో బ్యాటింగ్ ప్రాక్టిస్ కు అనుగుణంగా ఈ మ్యాచ్ లో రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ కే మొగ్గు చూపినట్టున్నారు. ఫాలో ఆన్ ఆడించి ఉంటే, ఇండియాకు ఇన్నింగ్స్ విజయం ఖరారు అయ్యేదేనేమో! అయితే.. ఇప్పుడు కూడా పరుగుల వారీగా భారీ విజయాన్ని సాధించింది భారత జట్టు.
తొలి ఇన్నింగ్స్ లో సెంచరీతో, రెండో ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీతో సత్తా చూపించిన మయాంక్ అగర్వాల్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. రవిచంద్రన్ అశ్విన్ కు ప్లేయర్ ఆఫ్ ద సీరిస్ దక్కింది.