కెలికి వాసన చూసుకోవడం అనే మోటు సామెత వుంది వెనకటికి. జగన్ తన బటన్ నొక్కుడు బాధలు తాను పడుతుంటే, ప్రతిపక్షాలకు ఊతం ఇచ్చేలా ఎవరి సాయం వారు చేస్తున్నారు వెనుక నుంచి. పనీ పాటా లేని పిచ్చిపనులు ఇవన్నీ. ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్చడమే గడబిడకు కారణమైందని తెలుసు. సరే, దాని వెనుక జగన్ కు వున్న రీజన్లు వుంటే వుండొచ్చు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం పేరు మార్చడం ఎందుకు? స్ధలదాత పేరు..క్షేత్రయ్య పేరు కలిపి పెట్టిన కళాక్షేత్రం పేరు అది. దాన్ని మార్చాలన్న ఆలోచన చేసిన మహానుభావుడు ఎవరో?
సిఎమ్ జగన్ లెవెల్ కు పుట్టిన బుద్ది అయితే కచ్చితంగా కాదు. కానీ కుక్క కన్నా తోకకు విశ్వాసం ఎక్కువ అన్న రీతిలో కింది స్థాయి అధికారులకో, నాయకులకో పుట్టిన బుద్ది కావచ్చు. ఇప్పుడు ఇది నెగిటివ్ వార్త కింద మారింది. ఇప్పుడు ఇగోకు పోవాల్సి వుంటుంది. దాంతో అది కాస్తా నెగటివ్ గా మారింది. దాంతో జనాల్లో ఇంతో అంతో నెగిటివ్.
ఇలాంటి చిన్న చిన్న విషయాలను జగన్ పట్టించుకోకపోవచ్చు. లేదా చూసీ చూడనట్లు వదిలేయవచ్చు. కానీ తెలుగుదేశం పార్టీని భుజాన వేసుకున్న మీడియాకు తెల్లవారుతూనే ఓ పెద్ద వార్తను చేతికి ఇచ్చినట్లు? ఏం దొరుకుతుందా అని చూస్తుంటుంది ఈ మీడియా. చిన్న ఉదాహరణ చెప్పుకోవాలంటే, విశాఖలో కీలకమైన జంక్షన్ లో రాత్రికి, రాత్రి ఏ అనుమతి లేకుండా, ఎవరికీ చెప్పకుండా మున్సిపాల్టీ ఏర్పాటు చేసుకున్న ట్రాఫిక్ ఐలాండ్ లో ఎన్టీఆర్ విగ్రహం పెట్టేసారు. అప్పట్లో ఇది తప్పు కాదా? అన్న సింగిల్ కాలమ్ వార్త లేదు.
మరి ఇప్పుడు అదే పని ఏ వైకాపా జనాలో చేస్తే ఇక మరి తెల్లవారుతూనే మొదలుపెడతారు ఊదరగొట్టడం. మొన్నటికి మొన్న ఓ ఫేక్ వార్త. లోకేష్ కు షేక్ హ్యాండ్ ఇచ్చిన కండక్టర్ ను సస్పెండ్ చేసారు అంటూ. దీన్ని నానా వైరల్ చేసారు. తరువాత ఆర్టీసీనే ఇది ఫేక్ అని ప్రకటించింది. దాన్ని రాయరు. చూపించరు. ఇక మరో దాని మీదకు వెళ్లిపోతారు. ఇలాంటి పరిస్థితి వుందని తెలిసి కూడా వైకాపా అభిమాన తోక జనాలో, అధికారులో పిచ్చి పనులు చేయకుండా వుండాలి కదా?