పేపర్లు రోజూ చదవకపోవడంతో సుబ్బారావు సంకటంలో పడ్డాడు. ఫిబ్రవరి 14 ఆవుని కౌగిలించుకునే పిలుపు తెలుసు కానీ, ఉపసంహరణ తెలియదు. ఫేస్‌బుక్, వాట్సప్ వినాశకారులనే నమ్మకంతో ఆయన వాడడు. సుబ్బారావు రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్. టోపీలంటే ఆయనకు ఇష్టం. టోపీవాలాలకు ఎక్కువ మొత్తం అప్పులు ఇవ్వడంతో బ్యాంక్ దివాలా తీసింది. ఆ గిల్ట్ ఫీలింగ్‌తో ఆయన భక్తుడయ్యాడు. బ్యాంకుని ముంచినందుకు గంగలో మునిగాడు. పూజలు చేసాడు. ఆ భక్తిలో భాగమే ఆవు కౌగిలింత.
చెవిలో పువ్వుతో రోడ్డున పడ్డాడు. వీధిలో అనేక ఆవులు, ఎద్దులు కనపడ్డాయి. రోడ్డు నడి మధ్య కూలబడి కష్టసుఖాలు నెమరేస్తూ వాహనాల బ్రేక్ సామర్థ్యాన్ని పరీక్షిస్తున్నాయి. జనం ఈ పశు సముదాయాన్నే ట్రాఫిక్ ఐలాండ్‌గా భావిస్తూ చుట్టూ తిరిగి వెళుతున్నారు. బిజీ సమయంలో కొన్ని ఆవులు ట్రాఫిక్ డ్యూటీ కూడా చేస్తాయి. ప్రభుత్వాలపై నిరసన వాటికి కూడా ఉన్నట్టు, ముఖ్యంగా ప్రభుత్వ వుద్యోగుల టైమింగ్‌కి అడ్డు పడుతుంటాయి. ఉదయాన్నే యాప్‌లో తమ ముఖం తామే చూసుకుని, జడుసుకునే టీచర్లను పనిగట్టుకుని ఇవి ఆలస్యం చేస్తుంటాయి.
ఆవులకి, అర్బన్ నక్సలిజానికి సంబంధం ఉందని అనుమానించిన కొందరు పోలీస్ అధికారులు ఒకట్రెండు సార్లు అరెస్ట్ చేసారు. ఉన్న గడ్డిని అవినీతి నాయకులు , అధికారులు మేయడంతో వాటికి తిండి తెచ్చి పెట్టలేక, అసలే కంపు కొడుతున్న లాకప్ గదుల్లో అదనంగా అవి తట్టలకొద్ది పేడ వేయడంతో అతలాకుతలం అయి వున్నప్పుడు , గోరక్షణ దళం వాళ్లు పెద్దపెద్ద కర్రలతో వచ్చారు. తమ లాఠీల కంటే, వారి కర్రలు పెద్దవిగా ఉండడంతో ఆవుల్ని పోలీసులు వదిలేశారు. ప్రతి పనికీ నివేదిక సమర్పించడం రివాజు కాబట్టి ఆవులు క్షీర జంతువులే తప్ప ఘోర జంతువులు కాదని 253 పేజీల రిపోర్ట్ రాసి పంపారు. అది అనేక శాఖలు తిరిగి చెత్తబుట్టలోకి చేరింది. కోట్లు ఖర్చు పెట్టి తయారు చేసే నివేదికలు కూడా చివరికి చేరేది అక్కడికే.
వీధి ఆవుల బాడీ లాంగ్వేజీకి భయపడిన సుబ్బారావు, ఒక ఆవు పెంపకందారున్ని వెతుక్కుంటూ వెళ్లాడు. అతని పేరు బంగారం. ఇంట్లో రాగి చెంబు కూడా లేని పేదవాడు. బ్యాంకులో లోన్ తీసుకుని ఆవు కొనుక్కున్నాడు. దురదృష్టం కొద్దీ అతని వినియోగదారులంతా టీచర్లే. జీతం సరిగా రాక పాల బకాయిపడ్డారు. ఇతను బ్యాంక్‌కు బకాయిపడ్డాడు. వచ్చిన వాడు తన ఆవును తోలుకెళ్లడానికి వచ్చిన బ్యాంక్ అధికారని అనుమానించాడు.
సుబ్బారావు నేరుగా వచ్చి తనని తాను రిటైర్డ్ బ్యాంక్ అధికారినని పరిచయం చేసుకున్నాడు. రిటైర్డ్ అనే పదం బంగారానికి అర్థం కాలేదు. బ్యాంక్ అధికారి అని అర్థమైంది. “అయ్యా, అప్పు తీసుకుంటే తీర్చడం ధర్మం. తీర్చలేని పరిస్థితి వుంటే ఖర్మం. మీరు ఇచ్చిన అప్పుతో ఆవు మాత్రమే కొన్నాను. ఇప్పుడు అదనంగా దూడ వుంది. దూడని వదిలి ఆవు రాదు. దూడపై మీకు హక్కు లేదు” అన్నాడు బంగారం.
బంగారం ఏం మాట్లాడాడో సుబ్బారావుకి అర్థం కాలేదు. అప్పు అన్న పదం అర్థమైంది.
“అప్పు అంటే దేవుడిలా సర్వాంతర్యామి. భయపడతగింది కాదు. ప్రతి మనిషి నెత్తి మీద జుత్తు లేకపోయినా అప్పు మాత్రం వుంది” అన్నాడు.
సుబ్బారావు మాటలు బంగారానికి అర్థం కాలేదు. అవుని లాక్కెళ్లడానికి మాయమాటలు చెబుతున్నాడనుకున్నాడు. “అయ్యా, ఆవు తప్ప వేరే దిక్కులేని వాన్ని. దాన్ని లాక్కెళ్లకండి” అన్నాడు.
“లాక్కెళ్లడమేంటి? దాన్ని కౌగిలించుకోడానికి వచ్చాను”
“అవుని ఎందుకు కౌగిలించుకోవడం? ఇంట్లో మీ ఆవిడ లేదా?” అయోమయంగా, అనుమానంగా అడిగాడు బంగారం.
“నువ్వు పేపర్లు చదవవా?” అడిగాడు సుబ్బారావు.
“నేను చదవను. కానీ మా ఆవు చదువుతుంది”
“ఆవుకి చదువొస్తుందా?”
“వస్తున్నట్టే వుంది. పేపర్ కనిపిస్తే ముక్కుపుటాలు పెద్దవి చేసి కోపంతో కొమ్ములు విసురుతుంది”
“అది ఇంటెలిజెంట్ ఆవు. హగ్ చేసుకోవాల్సిందే”
“దాన్నెందుకు కౌగిలించుకోవడం? ఓటు హక్కు కూడా లేదు. ఇంకా ఎన్నికలు రాలేదు”
“కౌగిలించుకుంటే శుభం జరుగుతుంది”
బంగారం పడిపడి నవ్వాడు. కాసేపటి తర్వాత “పుట్టినప్పటి నుంచి ఆవుల్ని సాకుతూ పాలు అమ్ముకుంటున్నా. పాక నుంచి ఎదగలేదు. మూడు పూట్ల తినలేదు. ఆవుల పెంపకందారులంతా ఇలాగే వున్నారు. మాకు రాని శుభం మీకెలా వస్తుంది?” అని అడిగాడు.
“తర్కం అనవసరం. అది ప్రభుత్వ పిలుపు. విధిగా గౌరవించాలి” అని సుబ్బారావు ఆవు దగ్గరికి వెళ్లాడు. ఆవు అనుమానంగా చూసింది. యజమానితో వాదిస్తున్న వాడు మంచివాడు కాదని అది గ్రహించింది. కొమ్ములు ఊపి, వీపుపై చర్మాన్ని చిట్లించి హెచ్చరించింది. అదేం పట్టించుకోకుండా సుబ్బారావు గంగడోలుపై చెయ్యి వేశాడు. తర్వాత అతను గాలిలో ఉన్నాడు. కొమ్ములు విదిల్చి, వెనుక కాలిని విచిత్ర కోణంలో తిప్పి ఆవు తన్నిన ఫలితం. దబ్బుమని సౌండ్‌తో బంగారం ఉలిక్కి పడ్డాడు. తర్వాత అంబులెన్స్ వచ్చింది. డాక్టర్ మొదట సుబ్బారావు వెన్నుపూసల్ని లెక్క పెట్టి, తర్వాత నోట్లు లెక్క పెట్టాడు. తర్వాత 63 టెస్టులు రాసి 32 టాబ్లెట్లు మింగించాడు. నొప్పి తగ్గడానికి స్టెరాయిడ్స్ ఇస్తే సుబ్బారావుకి ఆవులింతలు వచ్చాయి. కానీ భయపడ్డాడు. ఎందుకంటే ఆవులింతలో ఆవు వుంది.
జీఆర్ మహర్షి