తిరుపతి అసెంబ్లీ అభివృద్ధికి ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి చొరవతో సీఎం జగన్ భారీగా నిధులు మంజూరు చేశాడు. దాదాపు రూ.109 కోట్లు మంజూరు చేసినట్టు ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి తెలిపారు. ఈ నిధులతో తిరుపతి నగరాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు తీవ్ర కృషి చేస్తున్నట్టు ఆయన చెప్పారు. తన తనయుడు అభినయ్‌రెడ్డి సేవా దృక్పథం తోడవడం సంతోషకరమన్నారు.
“ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి, ఉన్నతాధికారులు వీధివీధికి, వార్డువార్డుకు, ఇంటిఇంటికి వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకోండి. వాటి పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేయండి. ప్రజలతో మనం ఉంటే, వారు కూడా మనతో ఉంటారు” అని సీఎం వైఎస్ జగన్ పదేపదే చెబుతున్న మాట.
తమ అధినేత జగన్ ఆదేశాలను తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, ఆయన తనయుడు భూమన అభినయ్‌రెడ్డి చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారు. తిరుపతి నియోజకవర్గంలోని 50 వార్డుల్లోని డ్వాక్రా, ఇతర సంఘాలతో సమావేశమయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా వార్డుల్లో డ్రైనేజీ, రోడ్లు, తాగునీటి సమస్యలను గుర్తించారు.
ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి వెళ్లినప్పటికీ, ఆయన తనయుడు అభినయ్ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు. తానే వార్డుబాట పట్టాడు. మంగళవారం తిరుపతి రెండో వార్డు ఆటో నగర్‌కు ఉదయాన్నే డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వరరెడ్డి, టౌన్‌ప్లానింగ్ అధికారి శ్రీనివాస్‌రెడ్డి, శానిటేషన్ సూపర్‌వైజర్ గోవర్దన్ తదితరులను వెంట తీసుకెళ్లాడు. వార్డుల్లో డ్రైనేజీ సిస్టం లేకపోవడంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా చూసి చలించిపోయాడు.
తిరుపతి నగరాభివృద్ధికి ప్రభుత్వం రూ.109 కోట్లు విడుదల చేసిందని, దీనికి తోడు ఎమ్మెల్యే ఫండ్ రూ.కోటిని కలుపుకుని తిరుపతిలో అన్ని సమస్యలను పరిష్కరించేందుకు పక్కా ప్రణాళిక రూపొందిస్తామని అభినయ్ చెప్పారు.
ఒక నెలలో తిరుపతి అసెంబ్లీ పరిధిలో డ్రైనేజీ నిర్మాణం, వీధుల్లో రోడ్ల ఏర్పాటు, బోర్లు వేయడంతో పాటు పైప్‌లైన్ ఏర్పాటు పూర్తి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. కాగా ఆటోనగర్‌లో రెండురోజుల పాటు పూర్తిగా తానే స్వయంగా ఉంటూ సమస్యలను తెలుసుకోవడంతో పరిష్కరిస్తామని స్థానికులకు భరోసా ఇచ్చాడు.
అలాగే స్వయంగా అభినయ్ తమ ఇళ్ల వద్దకే వచ్చి సమస్యలను అడుగుతుండడంతో జనం పెద్ద ఎత్తున చుట్టుకుంటున్నారు. దీంతో తమ వార్డుల్లో కూడా పర్యటించాలని అభినయ్‌పై ఒత్తిడి పెరుగుతోంది.