నాగచైతన్యకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాల్ని పంచుకున్నాడు వెంకటేష్. వెంకీమామ ప్రమోషన్ లో భాగంగా మాట్లాడిన వెంకీ.. చైతూ హీరో అవుతాడని అస్సలు ఊహించలేదన్నారు. నిజానికి రానా కూడా హీరో అవుతాడని ఊహించలేదని, ప్రస్తుతం అందరం సినిమాల్లోనే ఉన్నామని చెప్పుకొచ్చాడు.
“చైతూ ఇలా హీరో అవుతాడని ఎప్పుడూ అనుకోలేదు. అంతెందుకు, మనమంతా సినిమాల్లోకి వస్తామని ఎప్పుడూ అనుకోలేదు. చైతూకు, రానాకు, నాకు కూడా సినిమాల ఆలోచన లేదు. అందుకే నేను అమెరికా కూడా వెళ్లిపోయాను. కానీ అనుకోకుండా ఇప్పుడు అంతా సినిమాల్లోనే ఉన్నాం.”
చిన్నప్పుడు నాగచైతన్య చాలా లావుగా ఉండేవాడని, ఎప్పుడూ చికెన్ తింటూ, పెద్దపెద్ద బుగ్గలతో ముద్దుగా ఉండేవాడని చెప్పుకొచ్చాడు వెంకీ. అలాంటివాడు ఇప్పుడు ఫిట్ గా, స్లిమ్ గా తయారయ్యాడని మెచ్చుకున్నాడు. తన కళ్లముందు పెరిగిన నాగచైతన్యతో నటించడానికి చాలా ఇబ్బంది పడ్డానని చెప్పుకొచ్చాడు.
“చైతూతో ఫస్ట్ డే షూటింగ్ టైమ్ లో ఇబ్బంది పడ్డాను. రియల్ లైఫ్ లో క్యాజువల్ గా మాట్లాడుకునే వాళ్లం, నటించాలంటే కష్టమే. ఒక్కోసారి సీన్ కు సీన్ కు మధ్య చాలా సైలెంట్ గా ఉండిపోయేవాళ్లం. మెల్లగా క్యారెక్టర్స్ లోకి వెళ్లిన తర్వాత సర్దుకున్నాం. ఇలాంటి ఇబ్బందులు ఉంటాయనే, సినిమా షూటింగ్ ను డైలాగ్ సీన్స్ తో కాకుండా.. మాంటేజ్ సాంగ్ తో మొదలుపెట్టాం.”
సినిమా మొత్తానికి షాకింగ్ ఎలిమెంట్ ఒకటి ఉందంటున్నాడు వెంకీ. క్లైమాక్స్ లో బిగ్ సర్ ప్రైజ్ ఉంటుందని, అది చూసి ప్రేక్షకులు షాక్ అవుతారని, టోటల్ మూవీకి అదే హైలైట్ అవుతుందంటున్నాడు వెంకటేష్.