రామ్ గోపాల్ వర్మ సినిమా లేటైనా లేటెస్ట్ గా విడుదలకు ముస్తాబవుతోంది. ఈనెల 12న అమ్మరాజ్యంలో కడప బిడ్డలు థియేటర్లలోకి వస్తోంది. సెన్సార్ దగ్గర బ్రేక్ పడినా, ఇప్పుడు సరైన సమయంలో సినిమా విడుదలవుతోందని సంబరపడిపోతున్నాడు వర్మ. అసెంబ్లీ సమావేశాలు తన సినిమాకి మంచి పబ్లిసిటీగా మారే అవకాశముందని అంచనా వేస్తున్నాడు.
ఎలాగూ వైసీపీ నేతల్లో చాలామంది తొలిరోజు ఈ సినిమా చూస్తారు, రోజా లాంటి వాళ్లు చూసి ఊరుకుంటారా.. ఫలానా సినిమాలో ఫలానా “పప్పు సీన్” బాగుందంటూ కచ్చితంగా సభలో సెటైర్లు వేస్తారు. ఇక చూడాలి టీడీపీ వాళ్ల మొహాలు.. అటు సినిమా గురించి మాట్లాడలేక, ఇటు వీరి సెటైర్లు తట్టుకోలేక సతమతమైపోవడం గ్యారెంటీ.
అయితే సినిమాలో టీడీపీతో పాటు, వైసీపీపై కూడా సెటైర్లు ఉన్నాయని వార్తలొస్తున్న నేపథ్యంలో ఎలా చూసుకున్నా సినిమాపై సభలో చర్చ జరగడం మాత్రం అనివార్యం. అంటే ఒకరకంగా రామ్ గోపాల్ వర్మకు అప్పట్లో సెన్సార్ బోర్డ్ అభ్యంతరం చెప్పడం కూడా వరంగా మారిందనే చెప్పాలి. అప్పుడు ఆగిపోయి, సరిగ్గా అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వాడివేడిగా జరుగుతున్న టైమ్ లో రిలీజ్ అవుతోంది.
ట్రైలర్ లో చూపించిన దానికంటే గొప్పగా వర్మ సినిమాల్లో ఏమీ ఉండదని ఇటీవల పలు సినిమాలు రుజువు చేస్తున్నా.. ఓపెనింగ్స్ మాత్రం తగ్గడం లేదు. ఏమాత్రం సినిమా క్లిక్ అయినా రాజకీయాలతో సంబంధం ఉన్నవాళ్లు, లేనివాళ్లు అందరూ సినిమాకి రావడం ఖాయం. మొత్తమ్మీద అసెంబ్లీ సమావేశాల నడుమ ఈ పొలిటికల్ మూవీకి ఫ్రీ పబ్లిసిటీ రావడం ఖాయం. అటు వర్మ ఇప్పటికీ ప్రచారంతో ఊదరగొడుతున్నాడు.