14 ఏళ్ల పాటు సీఎం, 10 ఏళ్లపాటు ప్రతిపక్షనేత.. అంటూ గొప్పలు చెప్పుకునే చంద్రబాబు కిందపడ్డా తనదే పైచేయి అంటారు. ప్రస్తుతం టీడీపీ చరిత్రలోనే ఘోరమైన పరాజయంతో అతి తక్కువ మంది ఎమ్మెల్యేలకు నాయకుడిగా ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అయితే చంద్రబాబుకి త్వరలో ఈ ప్రతిపక్షనేత అనే హోదా కూడా ఎగిరిపోతుందనే అంచనాలున్నాయి.
ఎమ్మెల్యేల్లో చాలామంది వైసీపీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే గోడ దూకడానికి రెడీగా ఉన్నారు. కానీ జగన్ నియమం వల్ల భయపడి ఆగిపోతున్నారు. వచ్చే వారంతా పార్టీకి, పదవులకు రాజీనామా చేయాలని జగన్ కండిషన్ పెట్టడంతో కాస్త ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అయితే మధ్యేమార్గంగా వల్లభనేని వంశీ స్వతంత్ర సభ్యుడిగా కొనసాగుతూ వీరందరికీ ఓ దారి చూపడంతో టీడీపీ ఎమ్మెల్యేలలో కాస్త కదలిక వచ్చింది.
అటు జగన్ కూడా వ్యూహాత్మకంగా చంద్రబాబుని దెబ్బ కొట్టేందుకు సిద్ధమయ్యారు. తన స్వీయ నిబంధనను అతిక్రమించకుండానే బాబుని సైన్యంలేని సేనానిగా మార్చేందుకు వ్యూహ రచన చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే మరో వారం రోజుల్లోపు చంద్రబాబు ప్రతిపక్షనేత హోదా రద్దయిపోతుంది. దీని కోసం తెరవెనక ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ప్రస్తుత అసెంబ్లీలో టీడీపీకి 22మంది సభ్యులున్నారు. ఆరు నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో 23మంది గెలిచినా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీకి దూరమయ్యారు. వైసీపీ కండువా కప్పుకోకుండానే జగన్ కి అనుకూలంగా ఉండటానికి సిద్ధపడ్డారు వంశీ. అంటే వేటు పడకుండానే వైసీపీ తరపున ఎమ్మెల్యేగా కొనసాగుతారన్న మాట. టెక్నికల్ గా చెప్పాలంటే ఈయనిప్పుడు స్వతంత్ర్య ఎమ్మెల్యే.
శీతాకాల సమావేశాలు ముగిసేలోగా టీడీపీ ఎమ్మెల్యేలలో కనీసం ఆరుగురుని తమవైపు తిప్పుకునేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. అంటే ఇప్పుడున్న 22మందిలో ఆరుగురు ఎమ్మెల్యేలు బైటకు వస్తే టీడీపీ సంఖ్యా బలం చంద్రబాబుతో కలిపి 16కి పడిపోతుంది. మొత్తం 175మంది సభ్యులున్న ఏపీ అసెంబ్లీలో టీడీపీ బలం 10శాతం కంటే తక్కువ అవుతుంది. దీంతో ఆటోమేటిక్ గా చంద్రబాబుకి ప్రతిపక్షనేత హోదా రద్దవుతుంది.
అదే కనుక జరిగితే చంద్రబాబు తన కేబినెట్ ర్యాంక్ కోల్పోతారు. సాధారణ ఎమ్మెల్యేగా మిగిలిపోతారు, ఓ సాధారణ ఫ్లోర్ లీడర్ స్థాయికి పడిపోతారు. ఇదే జరిగితే చంద్రబాబుని మానసికంగా మరింత దెబ్బ కొట్టినట్టవుతుందని ఆలోచిస్తోంది వైసీపీ. వంశీ చూపిన దారి ఉంది కాబట్టి, ఆరుగురు ఎమ్మెల్యేలు టీడీపీకి రాజీనామా చేసి స్వతంత్ర సభ్యులుగా కొనసాగితే చాలు.. చంద్రబాబు ప్రతిపక్ష హోదా రద్దయిపోతుంది.