ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలకు దగ్గరుండి కండువాలు వేసిన పెద్ద మనిషి ఈయనే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నెగ్గిన అరవై ఏడు మందిలో ఇరవై మూడు మందిని తన పార్టీలోకి చేర్చుకుని, వారిలో నలుగురికి మంత్రి పదవులు సైతం ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు! అప్పుడు చంద్రబాబుకు రాజ్యాంగం పట్టలేదు, నైతిక విలువలు గుర్తుకు రాలేదు.
ఫిరాయించిన వాళ్లకు మంత్రి పదవులతో పాటు, అసెంబ్లీలో వాళ్లను తన పక్కనే కూర్చోబెట్టుకున్న పెద్దమనిషి చంద్రబాబు. ఇదంతా ఎప్పుడు జరిగిందో కాదాయె. ఆరు నెలల కిందట వరకూ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అలాంటి అడ్డగోలు రాజకీయమే చేశారు.
అయితే ఇప్పుడు ఆయన తన పార్టీ ఎమ్మెల్యేల పక్కనే కూర్చున్న వల్లభనేని వంశీ విషయంలో మాత్రం సహించలేకపోయారు. వల్లభనేని వంశీ మోహన్ ఏమీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. జగన్ తో సమావేశమై ఆ పార్టీ కండువా వేయించుకోలేదు. ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి వస్తే రావొచ్చు తప్ప, ఎమ్మెల్యేలను చేర్చుకునే ప్రసక్తి లేదని జగన్ పార్టీ స్పష్టం చేస్తూనే ఉంది.
అసెంబ్లీ సమావేశాల్లో కూడా వల్లభనేని వంశీ టీడీపీ ఎమ్మెల్యేల పక్కనూ కూర్చున్నారు తప్ప వెళ్లి వైసీపీ ఎమ్మెల్యేలతో కలిసి కూర్చోలేదు. అయినా ఆయన సభలో మాట్లాడటానికి వీల్లేదని తెలుగుదేశం పార్టీ గగ్గోలు పెట్టింది.
ఏ పార్టీలోనూ చేరని తమ పార్టీ ఎమ్మెల్యేను మాట్లాడనీయకూడదని చంద్రబాబు నాయుడు గట్టిగా ప్రయత్నించారు. ఆ ఎమ్మెల్యే మాట్లాడటానికి స్పీకర్ అనుమతిని ఇవ్వడంతో తెలుగుదేశం వాకౌట్ చేసింది!
ఇరవై మూడు మంది ఎమ్మెల్యేల ఫిరాయింపుకు పచ్చకండువాలు వేసి, వారిలో నలుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన దాకా వచ్చే సరికి, తన తిరుగుబాటుదారు ఒకరు సభలో మాట్లాడే సరికి ఎక్కడ లేని అసహనాన్ని వ్యక్తం చేశారు. తను చేస్తే ఒకటి, మరొకరు చేస్తే మరోటి. ఇదీ చంద్రబాబు నాయుడు మార్కు రాజకీయం. ఈ కామెడీలు చేయడమే చంద్రబాబు శేష రాజకీయ జీవితం కాబోలు!