మహారాష్ట్రలో అనేక రాజకీయ పరిణామాల అనంతరం శివసేన-ఎన్సీపీ- కాంగ్రెస్ పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పడింది. శివసేన అధిపతి ఉద్ధవ్ ఠాక్రే సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇదంతా జరిగి రెండో వారం గడుస్తూ ఉంది. అయితే ఇప్పటి వరకూ మంత్రివర్గం విషయం మాత్రం ఒక కొలిక్కి రాలేదు.
ఉద్ధవ్ తో పాటు అరడజను మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారికి శాఖల కేటాయింపు ఇప్పటి వరకూ జరగలేదు. ఇక మిగతా మంత్రివర్గం ఏర్పాటు కూడా జరగలేదు. ఇలా మహారాష్ట్రలో సీఎం మాత్రమే బాధ్యతల్లో కనిపిస్తున్నారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి శాఖలు దక్కలేదు, మిగతా శాఖలకు మంత్రులే లేరు!
ఈ విషయంలో కాంగ్రెస్-ఎన్సీపీ-శివసేన వర్గాలు తర్జనభర్జనలు పడుతున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి పీఠాన్ని అయితే సేనకు తేలికగా వదిలాయి కానీ.. మంత్రి పదవుల విషయంలో మాత్రం కాంగ్రెస్, ఎన్సీపీలు బెట్టు చేస్తుండవచ్చు. తమకు ప్రాధాన్యత గల శాఖలు కావాలని ఇవి డిమాండ్ చేస్తూ ఉండవచ్చు.
అక్కడకూ ఎన్సీపీ కూడా మంత్రి వర్గం బేరసారాల విషయంలో శివసేనతో ఒప్పందానికి వచ్చేసిందట. శివసేన-ఎన్సీపీ రెండూ ముంబై కేంద్రంగా రాజకీయాన్ని నడిపే పార్టీలు. అయితే కాంగ్రెస్ రాజకీయం మాత్రం ఢిల్లీ కేంద్రంగా నడుస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏయే శాఖలు కావాలనే అంశం గురించి కాంగ్రెస్ పార్టీ తన చర్చలను ఢిల్లీలో సాగిస్తోందట. దీంతో మంత్రివర్గ ఏర్పాటు మరింత ఆలస్యం కానుందని సమాచారం.