అసెంబ్లీ తొలి రోజు అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్యుద్ధం జరిగినా.. ఓ వర్గం మాత్రం సీఎం జగన్ భజనలోనే మునిగితేలింది. ముఖ్యంగా మంత్రి పదవులపై ఆశ ఉన్నవారే ఈ లిస్ట్ లో ప్రముఖంగా కనిపిస్తున్నారు. ఆ తర్వాత వీరిపై సోషల్ మీడియాలో కూడా ట్రోలింగ్ జరిగిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
అధినేతను పొగడటంలో తప్పేమీ లేదు, కానీ అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చించాల్సిన విలువైన సమయంలో అలాంటి ప్రసంగాలు ఎవరికైనా వృథాగానే కనిపిస్తాయి. ఆఖరికి సీఎం జగన్ కూడా ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతున్నంతసేపు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. తన వ్యాఖ్యలతో హర్ట్ అయిన జగన్ ను కాకా పట్టేందుకు ఆనం అలా ప్రవర్తించారని అందరికీ తెలుసు. జగన్ నవ్వుతున్నారని తెలిసి మరీ.. తాను అసహాయుడ్ని, అశక్తుడిని అంటూ పరోక్షంగా జగన్ కు ఆనం క్షమాపణలు చెప్పుకున్నట్టు కనిపించింది.
ఇక రోజా.. చంద్రబాబు, లోకేష్ అందర్నీ ఓ రౌండ్ వేసుకుని ఆఖరున జగన్ స్తోత్రాన్ని పఠించి తన భక్తి చాటుకున్నారు. గన్ కంటే జగన్ ముందొస్తారని పంచ్ డైలాగ్స్ కూడా కొట్టారు. తొలి విడత మంత్రి పదవి రాకపోవడంతో కాస్త అసంతృప్తిలో ఉన్న రోజా, మలివిడత కోసం ఇలా సీరియస్ గా ట్రై చేస్తున్నట్టున్నారు. అందుకే అందివచ్చిన ఏ అవకాశాన్నీ ఆమె వదిలి పెట్టలేదు.
ఇక విడదల రజనీ ఈ సెషన్ కే హైలెట్ గా నిలిచారు. జగనన్న, జగనన్న అంటూ తన ప్రసంగం మొత్తం అధినేతను అష్టోత్తరం చేస్తూనే ఉన్నారు. రజినీతో పాటు మరో ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలు, హోం మంత్రి కూడా జగన్ పై తమకున్న అపారమైన భక్తి శ్రద్ధలను యథాశక్తి చాటుకున్నారు.
అసెంబ్లీలో పార్టీ అధ్యక్షుడిని పొగడొద్దని ఎవరూ అనరు. అందులో తప్పు కూడా లేదు. కానీ దానికి కూడా ఓ లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ క్రాస్ చేసి మరీ భజనలో మునిగిపోవడం చూసేవారికి కాస్త చిరాకు తెప్పిస్తుంది. అయితే సీరియస్ గా సాగే విమర్శలు, ప్రతి విమర్శల మధ్య ఇలాంటి భజన కార్యక్రమాలు కాస్త ఆటవిడుపుగా ఉంటాయనేది మాత్రం వాస్తవం.