వైఎస్ జగన్ ప్రభుత్వంపై మత మార్పిడిల ముద్ర వేసేందుకు తీవ్రమైన ప్రయత్నాలే సాగుతూ ఉన్నాయి. ఒకవైపు పవన్ కల్యాణ్ ఈ విషయంలో బురద జల్లుతూ ఉన్నాడు. దానికి తోడు తెలుగుదేశం పార్టీ వర్గాలు ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నాయి.
ఇప్పటికే ఈ ప్రయత్నాలు చాలా జరిగాయి. అయితే ఎక్కడిక్కడ గుట్టు బయటపడుతూ ఉంది. తిరుమల బస్సుల్లో జెరుసలేం యాత్రకు ప్రభుత్వ సబ్సిడీకి సంబంధించిన ప్రచార టికెట్లు బయటపడటం దగ్గర నుంచి ఇదంతా ఒక వ్యూహ ప్రకారం సాగుతూ ఉంది. చంద్రబాబు హయాంలో ముద్రించిన టికెట్లను వైఎస్ జగన్ కు అంటగట్టే ప్రయత్నం జరిగిందప్పుడు. ఆ గుట్టు బయటపడ్డాకా టీడీపీ వాళ్లు దాన్ని వదిలిపెట్టారు.
ఆ తర్వాత ఏదో ఒక దాని ద్వారా వివాదాలు రేపే ప్రయత్నాలు సాగుతూ ఉన్నాయి. అందులో ఒకటి.. రేషన్ కార్డులపై యేసు బొమ్మల వ్యవహారం. ఇదంతా వైసీపీ ప్రభుత్వం చేయిస్తోందంటూ ఒక వర్గం మీడియా ప్రచారాన్ని ప్రారంభించింది. వాళ్ల ప్రచారం మొదలు కాగానే ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయ్యి, అందులోని అసలు కథ బయటకు తీసింది.
తెలుగుదేశం పార్టీ నేత అయిన ఒక రేషన్ డీలర్ నిర్వాకం అదని బయటపడింది. జగన్ ప్రభుత్వానికి ఆ తరహా ఇమేజ్ తీసుకురావడానికి ఆ తెలుగుదేశం నేత అలాంటి కార్డులను ముద్రించి పంచుతున్నట్టుగా తెలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం వడ్లమూరులో ఈ వ్యవహరం బయట పడింది. ఇప్పటికే అందుకు సంబంధించిన ఫొటోలను తెలుగుదేశం వర్గాలు వైరల్ చేశాయి. అదంతా జగన్ ప్రభుత్వం పని అని ప్రచారం చేశాయి. అయితే ఇందులో కర్త, కర్మ, క్రియ తెలుగుదేశం పార్టీ వాళ్లే అని తేలింది.
వడ్లమూరుకు చెందిన మంగాదేవి అనే ఆమె రేషన్‌డీలర్ కాగా, ఆమె భర్త టీడీపీ నాయకుడు. రేషన్ కార్డులపై ఆయన కావాలనే క్రీస్తు బొమ్మను ముద్రించి వాటిని వినియోగదారులకు ఇచ్చి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే ఇలా చేయిస్తున్నట్టు ప్రచారం చేస్తున్నాడని అధికారులు గుర్తించారు.
వైఎస్సార్‌సీపీపై బురద జల్లేందుకే పార్టీ పెద్దల సూచనల మేరకు తాజాగా క్రీస్తు ఫొటోను ముద్రించినట్టు అధికారులు గుర్తించినట్టు తెలిసింది. మొత్తానికి తెలుగుదేశం పార్టీ వాళ్లు, పవన్ కల్యాణ్ జగన్ పై పోరాటానికి ఇలా కావాలని మతరంగు పులిమి, తద్వారా ప్రయోజనాలు పొందే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఉన్నారు.