'కాదేదీ కవితకనర్హం' అన్నారు మహాకవి శ్రీశ్రీ. ఇప్పటి పాలిటిక్స్‌ను చూస్తుంటే 'కాదేదీ రాజకీయాలకనర్హం' అని చెప్పుకోవచ్చు. రాజకీయ నాయకులు దేంతోనైనా రాజకీయాలు చేయగలరు. 'ఇందుగలడందులేడను సందేహము వలదు' అన్నాడు అలనాడు ప్రహ్లాదుడు. అలాగే ఇప్పటి రాజకీయ నాయకులు దేంతోనైనా తాము రాజకీయాలు చేస్తామంటున్నారు.
సాధారణంగా ఎన్నికల్లో గెలుపు కోసం ఏ పార్టీ అయినా ఏం చేస్తుంది? అధికార పార్టీ అయితే తాము గొప్ప పాలన అందించామని, సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేసి ప్రజలకు గొప్ప సేవ చేశామని చెప్పుకుంటుంది. ప్రతిపక్షాలైతే పాలక పార్టీ వైఫల్యాలు ఎండగడతాయి. ఇక డబ్బు, మద్యం పంపిణీ, ఓటర్లకు ఏవో బహుమతులు అందచేయడం…ఇలాంటివన్నీ ఉంటాయి.
అయితే పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెసు ఈ గిమ్మిక్కులన్నీ చేస్తుందేమోగాని, అది ప్రజలను ఆకర్షించడానికి మరో పని కూడా చేస్తోంది. ఇది ఒకవిధంగా ప్రజల సెంటిమెంటును రెచ్చగొట్టడమే.
బెంగాల్లో త్వరంలో మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. 2021లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. మున్సిపల్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలకు సెమీ ఫైనల్స్లాంటివి. దీంతో ఈ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. గెలుపు కోసం ఆలోచనలు చేస్తున్నాయి. అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెసుకు వచ్చిన ఆలోచన 'బెంగాలీ సెంటిమెంటు'ను ప్రజల్లోకి తీసుకువెళ్లడం. అది ఎలా?
బెంగాల్లో ప్రసిద్ధులైన మహానుభావుల విగ్రహాలను ఇబ్బడిముబ్బడిగా నెలకొల్పడం ద్వారా సెంటిమెంటును వ్యాపింపచేయాలని టీఎంసీ ప్లాన్ చేసింది. దాని ఫలితంగా కోల్‌కతాలో ప్రముఖుల విగ్రహాలను నెలకొల్పుతున్నారు.
బెంగాల్ అంటే ముందుగా గుర్తొచ్చేవారు సంఘ సంస్కర్తలు. ఆధ్యాత్మికవాదులు, బ్రిటిష్ హయాంలో ప్రముఖ పాత్ర పోషించిన రాజకీయ నాయకులు, కవులు, కళాకారులు….ఇలా ఎందరో ఉన్నారు. వారి విగ్రహాలను విస్తృతంగా ఏర్పాటు చేస్తున్నారు.
మహాత్మా గాంధీ (బెంగాలీ కాకపోయినా జాతిపిత కదా), స్వామి వివేకానంద, సుభాష్ చంద్రబోస్, రవీంద్రనాథ్ టాగోర్ రామకృష్ణ పరమహంస, సిస్టర్ నివేదిత…ఇలా చెప్పుకుంటూపోతే ఈ జాబితా చాలా ఉంది.
వీరందరి విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈస్ట్ కోల్‌కతాలోని పూల్‌బాగ్‌లో 35 అడుగుల ఎత్తున్న గాంధీజీ, సుభాష్ చంద్రబాస్ విగ్రహాలను సెప్టెంబరులో నెలకొల్పారు. అక్కడే రవీంద్రనాథ్ టాగోర్, సిస్టర్ నివేదిత విగ్రహాలు పెట్టారు.
ఉత్తర కోల్‌కతాలో మరో 20 విగ్రహాలు నెలకొల్పడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే దక్షిణ కోలోకతాలో ఇంకా విగ్రహాలు పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. చాలా ప్రాంతాల్లో విగ్రహాలు నెలకొల్పుతున్నారు. ఈ ఏడాది మే నెలలో ఈశ్వరచంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని ఎవరో ధ్వంసం చేశారు. దీంతో టీఎంసీ-బీజేపీ మధ్య గొడవ జరిగింది. ఆ విగ్రహాన్ని మీరు ధ్వసం చేశారంటే…మీరు ధ్వసం చేశారని రెండు పార్టీల నాయకులు ఆరోపణలు చేసుకున్నారు.
ఇక అప్పటినుంచి విగ్రహాలు నెలకొల్పడంపై టీఎంసీ దృష్టి పెట్టింది. గంగానది ఘాట్స్ వెంబడి కూడా విగ్రహాలు పెట్టారు. రాత్రివేళ ఇవి బాగా కనబడేందుకు లైటింగ్ అలంకరణ చేశారు. బెంగాలీ సంస్కృతిని, మత సామరస్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే విగ్రహాల స్థాపన ఉద్దేశమని టీఎంసీ నాయకులు చెబుతున్నారు.
ఎక్కువగా సంఘ సంస్కర్తల విగ్రహాలకు ప్రాధాన్యం ఇచ్చారు. 19వ శతాబ్దం ప్రారంభం నుంచి 20 శతాబ్దం వరకు పునరజ్జీవన యుగం అంటారు. ఆ కాలంలోనే రాజారామ్మోహన్ రాయ్ తదితర అనేకమంది సంస్కర్తలు ప్రముఖ పాత్ర పోషించారు.
బెంగాలీ సంస్కృతిని, సంఘసంస్కర్తలు సమాజానికి చేసిన సేవను భవిష్యత్తు తరాలకు తెలియచేయడమే విగ్రహాలు ఏర్పాటు లక్ష్యమని చెబుతున్నారు. బీజేపీ మతోన్మాదాన్ని అడ్డుకోవడం కూడా విగ్రహాల ఏర్పాటు ఉద్దేశమని టీఎంసీ నేతలు చెబుతున్నారు.
వామపక్షాలు (సీపీఎం) బెంగాల్‌ను సుదీర్ఘకాలం పరిపాలించినప్పుడు మార్క్స్, ఏంగెల్స్ తదితర కమ్యూనిస్టు దిగ్గజాల విగ్రహాలు నెలకొల్పింది. కాని కాలక్రమంలో ఆ పార్టీ ప్రాభవం తగ్గిపోయి ఇప్పటికీ కోలుకోకుండా ఉంది. మరి టీఎంసీ పార్టీ విగ్రహాలు పెట్టినంత మాత్రాన ఎల్లకాలం అధికారంలో ఉంటుందా?