కర్ణాటక ఉప ఎన్నికల్లో కమలం పార్టీ ఘన విజయం సాధించింది. 15 స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా ఆ పార్టీ తరఫున 12 మంది విజయం సాధించారు. వీరంతా కూటమి ప్రభుత్వం పడిపోవడంలో కీలక పాత్ర పోషించి, ఇప్పుడు కమలం పార్టీ తరఫున ఎన్నికైన వారే. వీరు విజయం సాధించడం ద్వారా అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీకి మినిమం మెజారిటీ దక్కింది. దీంతో యడియూరప్ప ప్రభుత్వం కొనసాగడం సులువే.
అయితే పైకి సులువుగా కనిపిస్తున్నా.. రాజకీయంగా మాత్రం యడియూరప్పకు పరిణామాలు తేలికగా ఉండబోవని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇక మంత్రివర్గ కూర్పు ఇతర వ్యవహారాలు బీజేపీని ముప్పుతిప్పలు పెట్టే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు.
ఫిరాయింపు నేతలను ఎమ్మెల్యేలుగా గెలిపించుకునేందుకు యడియూరప్ప ఎన్నికల ప్రచారంలో చాలా మాటలే చెప్పారు. అందులో ముఖ్యమైనది వారిని గెలిపిస్తే మంత్రి పదవులు దక్కుతాయంటూ చెప్పడం. ప్రతి నియోజకవర్గంలోనూ ఇదే మాటే చెప్పారట ఆయన. ఈ మాటను ప్రజలు సీరియస్ గా తీసుకోకపోయినా.. ఆ ఎమ్మెల్యేలు మాత్రం దాన్నే పట్టుకునే అవకాశాలున్నాయి.
అందులోనూ వారంతా బీజేపీతో ఒక ఒప్పందానికి వచ్చి కాంగ్రెస్-జేడీఎస్ లకు తిరుగుబాటు చేసి వాళ్లే. కాబట్టి బీజేపీలో వాళ్లంతా కామ్ గా ఉంటారని అనుకోవడానికి లేదు. ఇప్పటికే మంత్రి పదవుల విషయంలో బీజేపీలో పలువురు అసంతృప్తులు ఉన్నారు.
వారికి తోడు ఇప్పుడు కొత్తగా గెలిచి వచ్చిన వాళ్ల డిమాండ్లు మొదలు కానున్నాయి. అయితే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ఎమ్మెల్యేలు ఎవరూ తోక జాడించకుండా చూసుకోవడానికి అయితే ఆ పార్టీకి అవకాశం ఉంది. స్వల్పమైన మెజారిటీతో అయినా ప్రభుత్వ మనుగడ కొనసాగడానికి అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి.