ఒకవైపు విపక్షాలు ఉల్లిధరల విషయంలో మోడీని, బీజేపీని విమర్శిస్తూ ఉన్నాయి. పార్లమెంటులో ఈ అంశంపై చర్చ సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన సమాధానం తీవ్ర విమర్శల పాలైంది. ఆ విషయంలో దేశ వ్యాప్తంగా నెటిజన్లు సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోశారు. అలా మోడీ సర్కారు విషయంలో నెటిజన్లు, ఇతర పార్టీలు స్పందిస్తుంటే.. ఏపీలో మాత్రం ఉల్లి సమస్యకు అంతా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని నిందిస్తూ ఉండటం గమనార్హం.
ఈ విషయంలో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ లు జగన్ లక్ష్యంగా రాజకీయాన్ని సాగిస్తూ ఉండటం గమనార్హం. ఉల్లి సమస్యకు అంతా జగన్ ప్రభుత్వమే కారణమన్నట్టుగా పవన్ మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ట్వీట్లన్నీ అలాగే సాగుతూ ఉన్నాయి. అయితే దేశ వ్యాప్తంగా ఈ సమస్య ఉందనే విషయాన్ని పవన్ గుర్తించడం లేదు. ఆయనకు ఆ అవగాహన ఉందో లేదో మరి.
ఉల్లి గురించి ఇతర రాజకీయ పార్టీలు మోడీని నిలదీస్తున్నాయి. ఎందుకంటే దేశంలో ఉల్లి పాయల లభ్యత లేదు. విదేశాల నుంచి దిగుమతే మార్గంగా కనిపిస్తూ ఉంది. అది జగన్ చేతిలో ఉండదు. మోడీ, కేంద్ర ప్రభుత్వం డిమాండ్ కు తగ్గట్టుగా స్పందించాల్సి ఉంటుంది. అదేమంటే తామిట్లో ఉల్లివాడమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రకటన చేశారు. మోడీ కూడా ఉల్లి తింటారో తినరో మరి.
ఇలా జాతీయ వ్యాప్తంగా చర్చ కేంద్రం గురించి సాగుతూ ఉంటే..చంద్రబాబు, పవన్ మాత్రం ఈ విషయాన్ని జగన్ మీద యుద్ధానికి వాడుకుంటూ ఉన్నారు. వీరికి మోడీ గురించి మాట్లాడే ధైర్యం కనిపించడం లేదు. కాంగ్రెస్ ఇతర పక్షాలు మోడీ గురించి మాట్లాడుతున్నాయి. టీడీపీ, జనసేనలకు మోడీ మీద విమర్శలు చేసే ధైర్యం కనిపించడం లేదు.
మోడీని ఏమైనా అంటే.. తర్వాత తమ పరిస్థితి ఏమవుతుందో అనే భయం వీరిలో ఉండవచ్చు. అందుకే జగన్ మీద విమర్శలు చేసేస్తే అయిపోతుందని అనుకుంటున్నారు. అయితే ఉన్నంత వైఎస్ జగన్ ప్రభుత్వం రాయితీ ధరకు ఉల్లిపాయలను అందిస్తోంది. కిలో పాతిక రూపాయలకే ఇస్తోంది. ఈ విషయాన్ని కూడా దాచేసి, మోడీ మీద మారు మాట్లాడే ధైర్యం లేక పవన్, చంద్రబాబులు వ్యవహరిస్తూ తమ డొల్లతనాన్ని చాటుకుంటున్నారు.