తన సంగతి దిక్కులేదు గానీ ఏపీలో జోస్యాలు!

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ తరఫున 2018 ఎన్నికలలో లిచిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి జోస్యాలు చెబుతున్నారు. గోషామహల్ నుంచి గెలిచిన ఈ ఎమ్మెల్యే ఒకవైపు తన భవిష్యత్తు…

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ తరఫున 2018 ఎన్నికలలో లిచిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి జోస్యాలు చెబుతున్నారు. గోషామహల్ నుంచి గెలిచిన ఈ ఎమ్మెల్యే ఒకవైపు తన భవిష్యత్తు ఏమిటో తనకే స్పష్టత లేని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. 

అయితే తాను దూరను కంత లేదు గానీ మెడకొక డోలు అన్న సామెత మాదిరిగా తన భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉన్నది గానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పడానికి ఆయన సాహసిస్తుండడమే తమాషా! ఏపీ రాజకీయాలపై తన అభిప్రాయాలు వెల్లడించిన ఎమ్మెల్యే రాజాసింగ్ అక్కడ రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గెలుస్తారని తన అంచనాలను బయటపెడుతున్నారు.

సూటిగా మాట్లాడుకోవాలంటే- తెలంగాణ రాజకీయాలలో రాజాసింగ్ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే సంగతి ఇప్పటిదాకా స్పష్టత లేదు. భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం ఆయన మీద సస్పెన్షన్ను కొనసాగిస్తూ ఉంది. బిజెపి అభ్యర్థుల జాబితాలను ప్రకటించే లోగా రాజాసింగ్ మీద భారతీయ జనతా పార్టీ విధించి ఉన్న సస్పెన్షన్ ను తొలగిస్తుందా లేదా అనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. తన నోటిదూకుడు కారణంగా.. మరో పార్టీలోకి వెళ్లడానికి అవకాశాలు కూడా లేని ఈ ఎమ్మెల్యే.. టికెట్ వస్తే బిజెపి తరఫున బరిలో ఉంటానే తప్ప.. మరో పార్టీలోకి వెళ్లేది లేదని చెప్పుకుంటూ ఉన్నారు. 

గత ఎన్నికలలో తమ పార్టీ తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యేను, బిజెపి సస్పెన్షన్ ద్వారా దూరం చేసుకుంది. ఆయన మీద సస్పెన్షన్ వేటును ఇవాళ రేపో ఎత్తివేస్తారని ప్రచారం మాత్రం చాలా కాలంగా జరుగుతోంది. కిషన్ రెడ్డి రాష్ట్ర పార్టీ సారథ్యం స్వీకరించిన తర్వాత దీనికి సంబంధించి ఆయనే స్వయంగా సంకేతాలు కూడా ఇచ్చారు. కానీ ఇప్పటిదాకా సస్పెన్షన్ ఎత్తివేత కార్యరూపం దాల్చలేదు. అలాంటిది తన భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉండగా రాజాసింగ్.. ఏపీలో చంద్రబాబునాయుడు గెలుపు గురించి చిలక పలుకులు పలుకుతున్నారు.

371 కోట్ల అవినీతి, నిధుల స్వాహా కేసుల్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జైలు పాలైన తర్వాత.. తెలుగుదేశం నాయకులు రకరకాల వ్యూహాలు అనుసరిస్తున్నారు. ఆయన అరెస్టు అక్రమం అంటూ వీలైనంత మంది ఇతర నాయకులతో చెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సహజంగానే.. చంద్రబాబు అరెస్టును ఎవ్వరు తప్పుపట్టినా సరే.. వారి మాటలకు పచ్చ మీడియాలో అగ్రప్రాధాన్యం లభిస్తూనే ఉంది. 

ఆ క్రమంలోనే రాజాసింగ్ ఏకంగా.. అరెస్టును తప్పుపట్టడం మాత్రమే కాదు.. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబే గెలుస్తారని కూడా చెప్పేస్తున్నారు. ఇంతకూ పాపం సొంత పార్టీలో ఆయనకు ఠికానా ఉంటుందో లేదో వేచిచూడాలి.