రాజకీయాల్లో అత్యుత్సాహానికి దారితీస్తున్న జెయిలు.. బెయిలు..

‘జెయిలు- బెయిలు’ అనే రెండు పదాల చుట్టూ ఇప్పుడు ఏపీ రాజకీయం తిరుగుతోంది. రాజకీయ నాయకులు తమకు చాలా అలవాటైన పద్ధతుల్లో ఈ రెండు పదాలకు లేని ప్రాధాన్యాన్ని ఆపాదిస్తున్నారు. తద్వారా తమకు మహా…

‘జెయిలు- బెయిలు’ అనే రెండు పదాల చుట్టూ ఇప్పుడు ఏపీ రాజకీయం తిరుగుతోంది. రాజకీయ నాయకులు తమకు చాలా అలవాటైన పద్ధతుల్లో ఈ రెండు పదాలకు లేని ప్రాధాన్యాన్ని ఆపాదిస్తున్నారు. తద్వారా తమకు మహా ద్రోహం జరిగినట్టుగానీ, తాము మహాద్భుత విజయం సాధించబోతున్నట్టుగానీ బిల్డప్ ఇవ్వడానికి కుటిలయత్నాలను కొనసాగిస్తున్నారు. 

నేరనిరూపణతో సంబంధంలేని జెయిలు- బెయిలు అనే రెండు రకాల వ్యవహారాల గురించి మాత్రమే ఊదరగొడుతూ ఉండడం వలన.. అసలు నేరం గురించిన తీవ్రత మరుగున పడిపోతుంది. జరిగిన నేరం ఎలాంటిది, దాని పర్యవసనాలు ఎలాంటివి అనే అంశాల మీదికి జనం దృష్టి వెళ్లడం లేదు.. జైలు బెయిలు రెండు వ్యవహారాలు మాత్రమే అగ్ర ప్రాధాన్యంతో చర్చకు నోచుకుంటున్నాయి. ప్రజల ఆలోచనలను హైజాక్ చేస్తున్న ఈ తరహా పోకడలమీద విశ్లేషణే ఈ వారం గ్రేట్ ఆంధ్ర కవర్ స్టోరీ ‘జెయిలు- బెయిలు’! 

‘‘ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, బెయిలు మీద బయట ఉన్న ఆర్ధిక నేరాల నిందితుడు..! బెయిలు మీద బయటకు వచ్చినా పర్లేదనుకుని, ఏదో ఒక కేసు బనాయించి.. తన ప్రత్యర్థులు అందరిని ఒకసారి జెయిలుకు పంపి వినోదం చూడాలనుకుంటున్నాడు’’ ఇదీ పచ్చమీడియా మొత్తం కోడై కూస్తున్న కథనం. వారం రోజులుగా టీవీ ఛానెళ్లు హోరెత్తిపోతున్నాయి. ఎవరు ఏ పాపమూ చేయకుండానే.. తనకు తలచిన అందరిని ఒక విడత జైలుకు పంపేసి, ఆ తర్వాత వారు బయలుమీద బయట తిరుగుతూ ఉండేలా అనుమతించడం అనేది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అంత సులువైన వ్యవహారమా?  అంత తలా తోకా లేకుండా ఎవరైనా సరే ఎలా మాట్లాడగలుగుతారు. ఏ నేరము చేయని వారిని ఆయన ఏ రకంగా కటకటాల వెనుకకు నెట్టగలరు?

లాజిక్ అనేది ఏనాడో మరిచిపోయిన తెలుగు నాట రాజకీయాలలో కేవలం విమర్శలు ప్రతి విమర్శలు మాత్రమే ప్రాతిపదికలుగా వ్యవహారాలు నడుస్తున్నాయి. కేసులో అరెస్టు అయిన వారైనా, వారి ప్రత్యర్థులైనా సరే అత్యుత్సాహంతో స్పందిస్తుండడం వలన.. కేసు యొక్క అసలు తీవ్రత సన్నగిల్లి పోతూ ఉంటుంది. ఆ విషయం ఉభయ పక్షాలకు చెందిన రాజకీయ నాయకులకు కూడా తెలుసు. కేసు యొక్క అసలు తీవ్రత మీద ప్రజల దృష్టి పడకుండా ఉండడానికి కొందరు ప్రయత్నం పూర్వకంగా రాద్దాంతం చేస్తుంటారు. వారి ఉచ్చులో పడి ప్రత్యర్ధులు చేసే రాద్ధాంతం కూడా కొన్ని సందర్భాలలో వారికే ఉపయోగపడుతుంది.

స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే ముసుగులో విచ్చలవిడిగా సర్కారు సొమ్మును దోచుకోవడానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తెగించిందని కేసు పూర్వాపరాలను పరిశీలించినప్పుడు అర్థమవుతుంది. కానీ, చంద్రబాబు నాయుడు అరెస్టు పర్యవసానంగా జరుగుతున్న వ్యవహారాలు  అసలు విషయాన్నీ పక్కదారి పట్టించేస్తున్నాయి. అవి ఏమిటో గమనిద్దాం,

వేడుకలలో అతి- అనుమానాలు పుట్టిస్తుంది!

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇది ఆయన ప్రభుత్వ హయాంలో ఆయన స్వయంగా చేసిన అవినీతికి సంబంధించిన ఆరోపణలపై విచారణ సవ్యంగా సాగడానికి న్యాయస్థానం చేసిన ఏర్పాటు! చంద్రబాబు నాయుడు బాహ్య ప్రపంచంలో ఉండటం ద్వారా తనమీద నమోదైన కేసులకు సంబంధించి దర్యాప్తును పక్కదారి పట్టించకుండా, సాక్షులను ప్రభావితం చేయకుండా  కోర్టు ఇలాంటి నిర్ణయం తీసుకుంది. వందల కోట్ల రూపాయలు కాజేసిన వ్యవహారంలో ఆయన  పాత్ర గురించి స్పష్టమైన ఆధారాలు లభించిన తర్వాత  మాత్రమే ఏసీబీ, సిఐడి పోలీసులు ఆయన అరెస్టు చేయడం జరిగింది.. ఇది కేవలం నేరము – శిక్ష కు సంబంధించిన వ్యవహారం మాత్రమే. 

పగ ప్రతీకారం, పోరాటం- విజయం… ఎంత మాత్రమూ కాదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అతిగా స్పందించడం ద్వారా ప్రజలకు కొత్త ఆలోచనలు పుట్టే పరిస్థితిని  కల్పించారు. మంత్రి రోజా వ్యవహార సరళి ఎబ్బెట్టుగా తయారైంది. బాణసంచా పేల్చి, డాన్సులు ఆడుతూ చంద్రబాబు నాయుడుకు రిమాండ్ విధించడాన్ని ఆమె అనుచరులతో కలిసి సెలబ్రేట్ చేసుకున్న తీరును గమనిస్తే  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల సుదీర్ఘ నిరీక్షణ ఫలించినట్లుగా మనకు అనిపిస్తుంది.  

అవినీతికి పాల్పడిన ఒక వ్యక్తికి శిక్ష పడడం అనేది చాలా సహజం. నేరారోపణలు నిగ్గు తేల్చే క్రమంలో ఆయన రిమాండ్ లో ఉండవలసిన రావడం సహజం. నిరూపణ అయితే శిక్ష అనుభవించి తీరాలి. అవినీతికి పాల్పడిన వాడు తప్పించుకోలేడు అన్నంతవరకూ మాత్రమే  రాజకీయ ప్రత్యర్ధులు ఈ అంశాన్ని వాడుకోగలరు తప్ప, ఆయన అరెస్టు, రిమాండ్  అనేది తాము సాధించిన విజయాలుగా భావిస్తూ సెలబ్రేట్ చేసుకుంటే ప్రజలకు కొత్త అనుమానం పుడుతుంది. 

రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే చంద్రబాబు నాయుడుని అరెస్టు చేసి వేధిస్తున్నారని..  తెలుగుదేశం నాయకులు ఎవరైనా పసలేని ఆరోపణలు చేస్తే గనుక, ఇలాంటి సెలబ్రేషన్స్ వలన వాటికి బలం చేకూరుతుంది. ఇంత సింపుల్ లాజిక్ ను రోజా వంటి తెలివైన నాయకురాలు ఎందుకు మిస్ అవుతున్నారో అర్థం కాని సంగతి. కేవలం రోజా మాత్రమే కాదు ఒకరిని చూసి మరొకరు తాము సెలబ్రేట్ చేసుకోకపోతే తప్పయిపోతుందన్నట్లుగా.. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్‌సీపీ దళాలు చంద్రబాబు రిమాండ్ ను అనుచితమైన రీతిలో పండుగ చేసుకున్నాయి. వారు కక్ష సాధిస్తున్నారనే అభిప్రాయాన్ని ప్రజలకు కలిగించాయి. 

ఆందోళనలో అతి- కుట్ర వ్యూహాలకు చిరునామా!

ప్రజా సమస్యలపై పోరాడుతూ ఉన్నప్పుడు, రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నప్పుడు.. నిరాహార దీక్షలు లాంటివి చేయడానికి ఉపక్రమించినప్పుడు పోలీసులు అరెస్టు చేసి జైల్లో పెడితే.. దాని గురించి రాష్ట్రమంతా ప్రజలు, పార్టీ అభిమానులు ఆందోళనలు చేయడంలో అర్థం ఉంది.  371 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిన కేసులో, సర్కారు సొమ్మును స్వాహా చేసినట్లుగా ఆధారాలు కనిపిస్తున్న కేసులో అరెస్టు అయిన అవినీతిపరుడి కోసం ఆందోళనలు చేయడం అనేది ఆశ్చర్యకరం. అవినీతి ఆరోపణల వంటి కేసుల్లో అరెస్టు అయినప్పుడు ఎంత అతిగా ఆందోళనలు చేస్తే, అంతగా తమ నేరం బయటపడిపోతుందని వారు భయపడుతున్నట్లుగా సంకేతాలు వెళతాయి. ఈ చిన్న లాజిక్ అర్థం కాని తెలుగుదేశం నాయకులు రాష్ట్రమంతటా కూడా విచ్చలవిడిగా చెలరేగిపోయారు! 

చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనేది తెలుగు జాతికి జరిగిన ద్రోహం అనే స్థాయిలో కలరింగ్ ఇవ్వడానికి ప్రయత్నించారు. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు, దీక్షలు పత్రికా ప్రకటనలతో విరుచుకుపడిపోతున్నారు. ఎందుకంటె రాద్ధాంతం చేస్తున్నారో ఎవ్వరికీ అర్థం కాని సంగతి. ప్రభుత్వం ఒక అవినీతి వ్యవహారాన్ని నిగ్గు తేల్చి, బాధ్యులపై చర్య తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా  ప్రతిపక్ష నాయకుడి అరెస్టు జరిగింది.  

చంద్రబాబు నాయుడు నిప్పు- ఆయనను ముట్టుకుంటే దహించుకుపోతారు అన్న స్థాయిలో పదేపదే నినదిస్తూ ఉండే తెలుగుదేశం నాయకులు తద్వారా తమలోని భయాన్ని చాటుకుంటున్నారు. పెద్దగా అరచి గోల చేయకపోతే తాము తప్పు చేసినట్లుగా ప్రజలు అనుకుంటారేమోనని వారు భయపడుతున్నట్లుగా కనిపిస్తోంది. వారు సంయమనం కోల్పోతున్నారు. ఎంత గొప్పగా గోల చేస్తే తాము అంత పరిశుద్ధులు అవుతామని వారు భావిస్తున్నట్లుగా ఉంది.

వారం రోజులుగా నానా గోల చేస్తున్న తెలుగుదేశం నాయకుల  ప్రకటనలను గమనించండి.  రాజకీయ కక్షతో, దుర్మార్గంగా వేధిస్తున్నారని నూటికి నూరు శాతం అందరూ అంటున్నారు. అయితే ఈ వేధింపుల అడ్డంకులను దాటుకుని తమ చంద్రబాబు నాయుడు సత్యసంధుడిగా బయటకు వస్తారని నిరూపణ అవుతారని వారిలో అతి కొద్దిమంది మాత్రమే అనగలుగుతున్నారు.. అంతకంటే తమాషా ఏమిటంటే.. తప్పు జరగలేదని ఏ ఒక్కరూ అనడం లేదు. తప్పు జరిగితే అధికారులను అరెస్టు చేయండి, ముఖ్యమంత్రిని  బాధ్యుడిగా చూపించి, అరెస్టు చేస్తే ఎలా? అని ఒక విచిత్రమైన వాదనలను లేవనెత్తుతున్నారు.

నేరాలను నేరాలుగా చూడలేమా?

జగన్మోహన్ రెడ్డి కూడా నేరస్థుడని, ఆయన బయలు మీద బయట ఉండి ముఖ్యమంత్రిగా పరిపాలన సాగిస్తున్నాడని అక్కసుతో ఎవరైనా అంటూ ఉండవచ్చు గాక. కానీ జగన్ మోహన్ రెడ్డి  మీద ఉన్న ఆరోపణలకు, చంద్రబాబు నాయుడు మీద వస్తున్న ఆరోపణలకు హస్తిమశకాంతరం అనదగినంతటి తేడా ఉంది. జగన్మోహన్ రెడ్డి ని ఆయన రాజకీయ ప్రత్యర్థులు బెయిలు మీద ఉన్న ఏ1 నిందితుడు  అని వ్యవహరిస్తుంటారు గనుక, తన ప్రత్యర్థులు అందరినీ జగన్ అరెస్టు చేసి బెయిలు మీద బయట తిరిగే పరిస్థితి కల్పిస్తున్నారని విపక్షాలు అంటున్నాయి.  

ఏ తప్పూ లేని చోట కేసులు బనాయించి తనకు తోచినట్లు జైల్లో పెట్టడం ప్రజాస్వామ్య వ్యవస్థలో అంత ఈజీ ఏమీ కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ను అరెస్టు చేసిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ సంగతి అయినా సరే.. కొన్ని సంవత్సరాలుగా దీని మీద సుదీర్ఘమైన విచారణ జరిగింది. ఇందులో పాత్రధారులుగా అనేక మందిని విడతలు విడతలుగా విచారించారు. వారి నుంచి సంపూర్ణంగా వివరాలు తీసుకున్నారు. వారందరూ తెలియజేసిన వివరాలను బట్టి అంతిమంగా లబ్ధి పొందినది చంద్రబాబు నాయుడు అని తేలిన తర్వాతనే ఆయన అరెస్టు వరకు వచ్చారు. తత్ఫలితంగానే ఆయన సుప్రీం కోర్టు నుంచి కొమ్ములు తిరిగిన న్యాయవాదులను ప్రత్యేక విమానంలో పిలిపించుకున్నా సరే.. బెయిలు కాదు కదా కనీసం హౌస్ కస్టడీ పిటిషన్ కూడా నెగ్గలేకపోయారు. 

చంద్రబాబు నాయుడు వ్యవహారం పూర్తిగా అవినీతికి అక్రమార్చనలకు పాల్పడిన కేసు! జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులు ఆర్థిక లావాదేవీలను అక్రమంగా భావిస్తున్న కేసులు! తప్పు అని తేలితే ఎవరైనా సరే శిక్ష అనుభవించాల్సిందే.

చంద్రబాబునాయుడు విషయంలో కూడా ఆయన ప్రభుత్వ హయాంలో జరిగిన లావాదేవీలను తప్పులుగా భావిస్తూ కేసులు నమోదు చేయదలచుకుంటే గనుక.. అవి పుంఖాను పుంఖాలుగా తయారు కావచ్చు. ప్రభుత్వంలోని పెద్దలు చెబుతున్నట్లుగా ఆయన మీద ముందు ముందు మరిన్ని కేసులు నమోదు అయ్యే అవకాశం ఉంది. అవన్నీ కూడా పూర్తిగా అవినీతికి సంబంధించిన కేసులు. మరి ఒక్క కేసులో అరెస్టు అయినందుకే ఇంతగా ఉక్కిరిబిక్కిరి అయిపోతున్న చంద్రబాబు నాయుడు, ఒకదాని వెనుక ఒకటి అన్ని కేసులూ ముసురుకున్నప్పుడు.. ఏమైపోతారో అర్థం కావడం లేదు.

స్థూలంగా మనం గమనించాల్సింది ఏమిటంటే రాజకీయ నాయకుల మీద కేసులు నమోదయినంత మాత్రాన.. వారి ప్రత్యర్ధులు పండగ చేసుకునే అవసరం లేదు. అనుచరులు గగ్గోలు పెట్టాల్సిన అగత్యమూ లేదు. ఆ కేసులు నిగ్గు తేలాలి.  నేరనిరూపణలు జరగాలి. శిక్షలు పడాలి. అదంతా జరగక ముందే ప్రదర్శించే అత్యుత్సాహం రకరకాల పెడ పోకడలకు కారణం అవుతుంది. పెడార్థాలకు దారితీస్తుంది.

..ఎల్ విజయలక్ష్మి