వైసీపీకి సొంత పార్టీ ఎమ్మెల్యే మాటలు ముల్లులా గుచ్చుతున్నాయి. జగన్ సొంత జిల్లాలోని ప్రొద్దుటూరు నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఏం మాట్లాడినా సంచలనమే. ఆయన ఏం చేసినా…. విపరీత ధోరణి కనిపిస్తుందనే అభిప్రాయాలున్నాయి. కర్నూలు మాజీ మేయర్ బంగి అనంతయ్యను మరిపించేలా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే చేష్టలుంటాయనే వాదన బలంగా ఉంది.
తాజాగా మరో సంచలన కామెంట్ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ముఖ్యంగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వ్యాఖ్యలతో వైసీపీ ఖంగుతింది. రాచమల్లు కీలక వ్యాఖ్యలు చూస్తే… అసెంబ్లీలో వైసీపీ ప్రజాప్రతినిధులు తప్పు చేశారనే భావన ప్రజల్లోకి తీసుకెళుతోంది. ప్రొద్దుటూరులో తన నివాసంలో రాచమల్లు మీడియాతో మాట్లాడుతూ నారా భువనేశ్వరికి సంబంధించి సంచలన కామెంట్స్ చేయడం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.
‘మాజీ సీఎం చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరిపై వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలను తోటి ఎమ్మెల్యేలుగా మేమంతా తప్పుబట్టాం. ఈ విషయంలో భువనేశ్వరి బాధపడి ఉంటే వైసీపీ ఎమ్మెల్యేలు అందరం కలిసి ఆమె పాదాలను కన్నీళ్లతో కడుగుతాం. వంశీ మా పార్టీ ఎమ్మెల్యే కాకపోయినా ఆ మాటలు మా ఎమ్మెల్యేలు అన్నారని ప్రచారం చేయడం తగదు. నీచ రాజకీ యాల కోసం గౌరవసభ పేరుతో నిర్వహించే కార్యక్రమాల్లో భువనేశ్వరిని అగౌరవపరచడం సబబుగా లేదు’ అని శివప్రసాదరెడ్డి పేర్కొన్నారు.
ఒక వైపు వల్లభనేని వంశీ తమ పార్టీ ఎమ్మెల్యే కాదంటూనే, మరోవైపు భువనేశ్వరి బాధ పడి ఉంటే వైసీపీ ఎమ్మెల్యేలంతా ఆమె పాదాలను కన్నీళ్లతో కడుగుతామని రాచమల్లు ప్రకటించడంపై వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తనతో పాటు జగన్ కూడా భువనేశ్వరి కాళ్లు కడుగుతానని చెప్పడం ఏంటని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
అసెంబ్లీలో భువనేశ్వరిని తమ సభ్యులేమీ అనలేదని స్వయంగా ముఖ్యమంత్రి జగన్ ప్రకటించిన నేపథ్యంలో రాచమల్లు తాజా వ్యాఖ్యలు జగన్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేశాయని సొంత పార్టీ నేతలు వాపోతున్నారు.