మాజీ ముఖ్యమంత్రి రోశయ్య అంటే పెద్దరికానికి నిలువెత్తు విగ్రహం. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన పాటించిన విలువలు సదా ఆచరణీయం. రాజకీయాల్లో అజాత శత్రువుగా పేరు పొందారు. కాంగ్రెస్‌లో గ్రూపు రాజకీయాలకు దూరంగా, మర్రి చెన్నా రెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి, నేదురమల్లి జనార్దన్‌రెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డి…ఇలా అందరి కేబినెట్‌లలో కీలక మంత్రిగా పని చేయడం సామాన్య విషయం కాదు.
మరీ ముఖ్యంగా దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డితో రోశయ్య అనుబంధం ఎంతో గొప్పది. వైఎస్సార్ తనయుడిగా వైఎస్ జగన్ అంటే తనకు అభిమానం, గౌరవం అని పలు సందర్భాల్లో రోశయ్య చెప్పారు. ప్రస్తుతం రోశయ్య మన నుంచి అందనంత దూరాలకు వెళ్లిపోయారు. భౌతికంగా ఆయన దూరమైనా, జ్ఞాపకాలు మాత్రం మిగిలాయి.
అసెంబ్లీలో చంద్రబాబును రోశయ్య చీల్చి చెండాడిన వీడియోలను వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఇంత వరకూ బాగానే ఉంది. రోశయ్యకు నివాళి అర్పించేందుకు జగన్‌కు తీరిక లేకపోవడం గమనార్హం. ఇదే రాజకీయంగా బద్ధ విరోధి అయిన చంద్రబాబు ఎంతో హూందాగా వ్యవహరించారు.
రోశయ్య భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. రోశయ్య భార్య, కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ఓదార్చారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ , ఏపీ మంత్రులు కూడా రోశయ్యకు ఘన నివాళులర్పించారు. ఒక్క జగన్ వెళ్లకపోవడం ఎందుకనో లోటుగా కనిపిస్తోంది.
జగన్ మాత్రం హైదరాబాద్ వెళ్లలేకపోయారు. సంతాప ప్రకటనతో సరిపెట్టారు. పెద్దలు రోశయ్య మరణవార్త తననెంతగానో బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. రోశయ్య మరణం తెలుగు రాష్ట్రాలకు తీరనిలోటు అని జగన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా రోశయ్య కుమారుడికి జగన్ ఫోన్ చేసి, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. తన స్నేహితుడు వైఎస్సార్ కుమారుడు జగన్‌ను బిడ్డగా అభివర్ణించిన రోశయ్యకు తుది వీడ్కోలు పలకడంలో ఏపీ ముఖ్యమంత్రి అనుసరించిన వైఖరి మాత్రం సమంజసంగా లేదు.
రోశయ్య అంత్యక్రియలకు ప్రభుత్వం తరపున ముగ్గురు మంత్రులను పంపే బదులు, తానే వెళ్లి వుంటే ఎంతో గౌరవంగా వుండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకనో కొన్ని విషయాల్లో జగన్ మరీ మొండిగా ఉంటారు. ఇలాంటి సందర్భాల్లోనైనా పట్టువిడుపులు ఉండాలని చంద్రబాబును చూసి నేర్చుకోవాలని పలువురు హితవు చెబుతున్నారు.