ఏపీ ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ మధ్య ఘర్షణ వైఖరి కొనసాగుతూనే ఉంది. దీనికి అనేక కారణాలున్నాయి. ఎవరి వాదన వారిది. రాజ్యాంగంలో ఏ వ్యవస్థ ఎక్కువ కాదు, తక్కువ కాదు. దేని ప్రాధాన్యం దానిదే. ఇదిలా వుండగా హైకోర్టు న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెడుతూ, అవమానిస్తున్నారని, చర్యలు తీసుకోవాలని కోరుతూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ 2020 మే 24న పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నిందితులను పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని…కేసు విచారణ బాధ్యతల్ని సీబీఐకి అప్పగించాలని 2020 అక్టోబరు 12న హైకోర్టు ఆదేశించింది. అయితే నిందితులను పట్టుకోవడంలోనూ, అలాగే న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులను పెట్టడంలోనూ సీబీఐ విఫలమైందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. దీంతో పలువురు నిందితుల్ని సీబీఐ అరెస్ట్ చేసింది. వీరిలో ఆరుగురు తమకు బెయిల్ మంజూరు చేయాలంటూ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.
ఆరుగురికి బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ సందర్భంగా జస్టిస్ డి.రమేశ్ తీర్పు వెలువరిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ తీర్పుపై ప్రభుత్వ అనుబంధ పత్రిక సాక్షి నిలదీయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ కథంటే తెలుసుకుందాం.
తమకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఔతు శ్రీధర్ రెడ్డి, జలగం వెంకటసత్యనారాయణ, దరిశ కిషోర్‌కుమార్ రెడ్డి, గూడ శ్రీధర్‌రెడ్డి, సుస్వరం శ్రీనాథ్, సుద్దులూరి అజయ్ అమృత్ హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న వీరికి బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. ఈ సందర్భంగా జస్టిస్ డి.రమేశ్ తన తీర్పులో ఏమన్నారంటే….
‘కేసును సీబీఐకి అప్పగించి ఏడాది అయినా నిందితుల్ని పట్టుకోలేకపోయింది. దీన్ని బట్టే పిటిషనర్లు ఎంత శక్తిమంతులో అర్థమవుతుంది. హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై పిటిషనర్లు పెట్టిన పోస్టింగ్‌లు పరిశీలిస్తే న్యాయవ్యవస్థపై కుట్ర పన్నినట్లు భావించాల్సి వస్తుంది. సామాజిక మాధ్యమాల్లో పెడుతున్న పోస్టింగులు న్యాయమూర్తులపై చేస్తున్నవిగా కాకుండా.. న్యాయవ్యవస్థపై దాడిగానే చూడాలి. కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించి న ఏడాది తర్వాత నిందితులను ఆ ఏడాది అక్టోబరు 21న అరెస్ట్ చేశారు. దీన్ని బట్టి పిటిషనర్లు చిన్నవారైనప్పటికీ ఈ కుట్ర వెనుక పెద్ద వ్యక్తులు ఉండవచ్చునని అర్థం అవుతుంది’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు.
నిందితులకు బెయిల్ తిరస్కరిస్తూ జడ్జి డి.రమేశ్ కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో సాక్షి దినపత్రిక తనదైన వాదనను బలంగా రాసుకొచ్చింది. బెయిల్ తిరస్కరణ వార్తను ఇస్తూ… చివరిలో టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి బెయిల్ అంశాన్ని ప్రస్తావిస్తూ , ప్రశ్నిస్తూ సమాజాన్ని ఆలోచనలో పడేసింది. ‘సాక్షి’ ఏమంటోందంటే…
‘టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి రాజ్యాంగ పదవిలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మీడియా సమావేశంలో బహిరంగంగా దూషించిన కేసులో అరెస్టయినా ఒక రోజులోనే బెయిల్ మంజూరైంది. సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రిని బహిరంగంగా దూషించిన కేసులో పట్టాభికి వెంటనే బెయిల్ ఇవ్వడం, జడ్జిలను దూషించిన కేసులో మాత్రం బెయిల్ నిరాకరించడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు’ అని ఘాటు రాతలు రాసుకొచ్చింది. దూషణల విషయంలో ఒకరికి ఒక న్యాయం, మరొకరికి మరో న్యాయం ఏంటనే ప్రశ్నల బీజాన్ని సాక్షి పత్రిక పాఠకుల మనసుల్లో నాటగలిగింది. ప్రశ్నలకు ఏ వ్యవస్థ అతీతం కాదు కదా!