విచారణ ముగిసింది.. సస్పెన్స్ కొనసాగుతోంది

కిట్టీ పార్టీల పేరిట కోట్ల రూపాయల ఆర్థిక మోసాలకు పాల్పడిన శిల్పా చౌదరి నుంచి పోలీసులు కీలకమైన విషయాలు రాబట్టలేకపోయారు. కోర్టు అనుమతితో 2 రోజులు కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. ఆమె నుంచి తగినంత…

కిట్టీ పార్టీల పేరిట కోట్ల రూపాయల ఆర్థిక మోసాలకు పాల్పడిన శిల్పా చౌదరి నుంచి పోలీసులు కీలకమైన విషయాలు రాబట్టలేకపోయారు. కోర్టు అనుమతితో 2 రోజులు కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. ఆమె నుంచి తగినంత సమాచారాన్ని సేకరించలేకపోయారు. నిన్న సాయంత్రంతో ఆమె కస్టడీ ముగిసింది, ఆ వెంటనే తిరిగి చంచల్ గూడ జైలుకు ఆమెను తరలించారు పోలీసులు.

ఈ 2 రోజుల విచారణలో శిల్ప చౌదరి ఏం చెప్పిందనే విషయాన్ని పోలీసులు బయటపెట్టడం లేదు. తాజా సమాచారం ప్రకారం.. ఆమె అరకొర వివరాలు మాత్రమే అందించినట్టు తెలుస్తోంది. సుదీర్ఘ విచారణలో తను అమాయకురాలినని, ఎవ్వర్నీ మోసం చేయలేదని మాత్రమే ఆమె పదేపదే చెప్పినట్టు తెలుస్తోంది. అందరికీ చెల్లింపులు చేస్తానని, ఎవ్వరి డబ్బు ఉంచుకోనని ఆమె చెబుతోంది. ఈ సందర్భంగా తన పలుకుబడి, సర్కిల్ మొత్తాన్ని ఆమె బయటపెట్టిందట.

కిట్టీ పార్టీల పేరిట సంపన్నులకు దగ్గరై వాళ్ల దగ్గర్నుంచి భారీగా డబ్బు తీసుకుంది శిల్పా చౌదరి. ఈమె బాధితుల్లో మహేష్ బాబు సోదరి, సుధీర్ బాబు భార్య ఉన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా సెహరి అనే సినిమాతో హీరోగా పరిచయమైన హర్ష్ కూడా పోలీస్ స్టేషన్ కు హాజరై, తను కూడా శిల్పాచౌదరి బాధితుల జాబితాలో ఉన్నానని తెలిపాడు.

వీళ్లతో పాటు పలువురు ఐఏఎస్ అధికారులు, రాజకీయ నాయకులు కూడా శిల్పా చౌదరి బాధితుల లిస్ట్ లో ఉన్నా రనే విషయం అన్-అఫీషియల్ గా వెలుగులోకి వచ్చింది. దీంతో ఇది హై-ప్రొఫైల్ కేసుగా మారింది. అందుకే విచారణ వివరాల్ని పోలీసులు బయటపెట్టడం లేదు. తాజా సమాచారం ప్రకారం.. చాలామంది పెద్ద మనుషులు తమ దగ్గరున్న బ్లాక్ మనీని వైట్ గా మార్చుకునేందుకు శిల్పా చౌదరిని ఆశ్రయించినట్టు తెలుస్తోంది.

2 రోజుల విచారణలో ఎన్నో విషయాల్ని వెల్లడించిన శిల్పా చౌదరి, కోట్ల రూపాయల డబ్బు ఎక్కడ ఉందనే విషయాన్ని మాత్రం బయటపెట్టలేదు. ఓ హాస్పిటల్ నిర్మాణంలో పెట్టుబడి పెట్టానని ఓసారి, మరో వ్యక్తికి అందజేశానని మరోసారి, ఇలా పొంతనలేని సమాధానాలు ఇచ్చినట్టు తెలుస్తోంది.

మరోవైపు కొంతమంది పెద్దమనుషులంతా కలిసి ఈ వివాదాన్ని తెరవెనక పరిష్కరించుకునేందుకు కూడా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది.