కరోనా మహమ్మారి మరో భారత ఎంపీని బలి తీసుకుంది. ఇప్పటికే కరోనా కారణంగా ఇద్దరు ముగ్గురు ఎంపీలు మరణించిన వార్తలు రాగా, తాజాగా మరో కేంద్ర మంత్రి ఈ మహమ్మారి వల్ల మృతి చెందిన వార్తలు వస్తున్నాయి. కర్ణాటకకు చెందిన సీనియర్ బీజేపీ నేత, కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ అంగడి కరోనా వల్ల మరణించారు. 65 యేళ్ల ఈ రాజకీయ నేత గత కొన్ని రోజులుగా ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మరణించినట్టుగా తెలుస్తోంది.
ఇటీవలే పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఎంపీలందరికీ కరోనా టెస్టులు చేయగా.. దాదాపు 30 మందికిపైగా నేతలకు కరోనా పాజిటివ్ రిజల్ట్ వచ్చినట్టుగా వార్తలు వచ్చాయి. వారిలో చాలా మంది సులభంగానే కోలుకున్నా.. కొందరు పార్లమెంటేరియన్లు మాత్రం కరోనా ను జయించలేకపోయారు.
తమిళనాట ఒక ఎంపీ కరోనాతో మరణించారు. తిరుపతి ఎంపీ మొదట కరోనా బారిన పడి కోలుకున్నాకా.. ఆయన వేరే చికిత్స పొందుతూ హార్ట్ అటాక్ తో మరణించినట్టుగా వార్తలు వచ్చాయి.
కేంద్ర మంత్రి సురేష్ అంగడి మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్రమోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన భారతీయ జనతా పార్టీకి గొప్ప కార్యకర్త అని మోడీ అభివర్ణించారు. బెళగావి నుంచి సురేష్ అంగడి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు.