యడియూరప్ప కుర్చీ సేఫ్!

కర్ణాటక అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలపై పూర్తి స్పష్టత వచ్చింది. మొత్తం 15 సీట్లకు జరిగిన ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 12 సీట్లను నెగ్గింది. కాంగ్రెస్ పార్టీ రెండు సీట్లకు పరిమితం…

కర్ణాటక అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలపై పూర్తి స్పష్టత వచ్చింది. మొత్తం 15 సీట్లకు జరిగిన ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 12 సీట్లను నెగ్గింది. కాంగ్రెస్ పార్టీ రెండు సీట్లకు పరిమితం అయ్యింది. జేడీఎస్ కనీసం ఖాతా కూడా తెరవలేదు. భారతీయ జనతా పార్టీ రెబెల్ ఒక చోట నెగ్గినట్టుగా ఉన్నారు.

కనీసం ఏడు సీట్లలో నెగ్గితే బలాబలాల ప్రకారం యడియూరప్ప ప్రభుత్వం నిలబడే అవకాశాలు ఉండేవి. ఇప్పుడు ఏకంగా పన్నెండు సీట్లలో నెగ్గింది భారతీయ జనతా పార్టీ. దీంతో ప్రభుత్వ మనుగడకు ఢోకా లేకుండా పోయింది. ఇక అన్నీ తమ సీట్లే అయినా వాటిని నిలబెట్టుకోలేకపోయాయి కాంగ్రెస్ –జేఎడీస్ లు. సార్వత్రిక ఎన్నికలప్పుడు నెగ్గిన ఆ పార్టీ లు నెగ్గిన సీట్లు ఇవి. వాటిల్లో ఆ పార్టీలు హవా నిలుపుకోలేకపోయాయి. ఆయా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి, బీజేపీ వైపు వెళ్లి నెగ్గారు. తమ పంతాన్ని నిలుపుకున్నారు.
 
ఫిరాయింపుదారులందరికీ భారతీయ జనతా పార్టీ టికెట్లను కేటాయించింది. ఆ రాజకీయ వ్యూహం పట్ల అనేక మంది అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే వారంతా ఇప్పుడు బీజేపీ తరఫున నెగ్గడంతో కమలం పార్టీ ఖుషీ రెట్టింపు అయ్యింది. ప్రస్తుతానికి అయితే యడియూరప్ప కుర్చీ సేఫ్ జోన్లో ఉన్నట్టే!