ఫైర్ బ్రాండ్ రోజా మరోసారి తన మార్క్ చూపించారు. అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్షంపై విరుచుకుపడ్డారు. రోజా పంచ్ లకు ప్రతిపక్ష సభ్యుల దగ్గర సమాధానం లేదు. అలా ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారామె. మహిళా భద్రతకు సంబంధించి జరగాల్సిన చర్చకు ప్రతిపక్ష సభ్యులు అడ్డుపడ్డారు. దాని స్థానంలో పెరిగిన ఉల్లిధరపై తక్షణం చర్చించాలని డిమాండ్ చేశారు. దీనిపై సూటిగా టీడీపీపై విమర్శలు చేశారు రోజా.
“ఉల్లిపాయ లేకపోతే మా ప్రాణం పోతుందన్నట్టు టీడీపీ మాట్లాడుతోంది. ఆడవాళ్ల ప్రాణ-మానాల మీద వాళ్లకు ఎంత గౌరవం ఉందో అర్థమౌతోంది. మహిళల్ని చులకనగా చూస్తూ ఐదేళ్లు పాలించారు కాబట్టే, మహిళలంతా వీళ్లను ఆ మూలన కూర్చోబెట్టారు. లోకేష్ తినే పప్పులో ఉల్లిపాయ లేదని చంద్రబాబు బాధపడుతున్నారు కానీ, ఈ రాష్ట్రంలో ఆడపిల్ల మానప్రాణాలకు భద్రత లేదనే విషయంపై ఆయనకు బాధలేదు.”
ఇక్కడితో ఆగలేదు రోజా. చంద్రబాబు గత చరిత్ర మొత్తం తవ్వితీశారు. వనజాక్షి విషయంలో చంద్రబాబు అనుసరించిన తీరును దుయ్యబట్టారు. పనిలోపనిగా దిశ హత్య కేసుకు సంబంధించి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల్ని కూడా ప్రస్తావించారు.
“కోడలు మగపిల్లాడ్ని కంటే అత్త సంతోషించదా అని గతంలోనే చంద్రబాబు కామెంట్ చేశారు. అంటే ఆడపిల్ల పుట్టుకనే విబేధించే చంద్రబాబు, మహిళల భద్రత గురించి మాట్లాడతారని అనుకోవడం లేదు. అంతేకాకుండా, మరో పెద్దమనిషి ఉన్నాడు. అతడే పవన్ కల్యాణ్. చరిత్రలోనే 2 కోట్ల నిల్చొని ఓడిపోయిన గొప్ప నాయకుడు. ఆయన ఎమ్మెల్యే ఇక్కడున్నారు. ఆయన ద్వారా చెప్పాలనుకుంటున్నాను, రేప్ చేయాల్సిన వారిని 2 బెత్తం దెబ్బలు కొట్టమనడం ఎంతవరకు సమంజసం.”
13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశానని గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబుకు, ఆడపిల్లల భద్రత గురించి మాట్లాడేటప్పుడు రాద్దాంత చేయకూడదననే విషయం తెలియకపోవడం బాధాకరమన్నారు రోజా. ఇది ముఖ్యమైన విషయమని ముఖ్యమంత్రి చెబుతున్నప్పటికీ రాద్దాంతం చేస్తున్నారంటే, మహిళ భద్రతపై చంద్రబాబుకున్న చిత్తశుద్ధి ఏంటో అర్థమౌతోందని సెటైర్లు వేశారు.