హెరిటేజ్ సంస్థ చంద్రబాబుది కానే కాదట. ఈ విషయాన్ని సాక్షాత్తూ అసెంబ్లీలో సెలవిచ్చారు. హెరిటేజ్ ఫుడ్స్ వేరనీ, హెరిటేజ్ ఫ్రెష్ వేరనీ.. చంద్రబాబు సెలవిస్తోంటే, అసెంబ్లీలో అధికార పక్ష సభ్యులు విస్తుపోయారు. ఈ వ్యవహారాన్ని ప్రత్యక్ష ప్రసారాల ద్వారా వీక్షిస్తోన్న సాధారణ ప్రజానీకం కూడా ముక్కున వేలేసుకున్నారు.
చంద్రబాబు వ్యాపార సామ్రాజ్యం 'హెరిటేజ్' ద్వారానే విస్తరించబడిందన్నది ఓపెన్ సీక్రెట్.అయితే, అత్యంత వ్యూహాత్మకంగా హెరిటేజ్ సంస్థకి చెందిన కొన్ని విభాగాల్ని ఫ్యూచర్ గ్రూప్‌కి కొన్నాళ్ళ క్రితమే విక్రయించేశారు. అలా ఆయనెందుకు చేశారో.. ఇదిగో, ఇప్పుడిలా అర్థమవుతోంది. హెరిటేజ్ ఫ్రెష్ పేరిట అత్యధిక ధరలతో సామాన్యుల్ని బెంబేలెత్తిస్తున్నారంటూ 'నారా' కుటుంబంపై ఆరోపణలున్నాయి.
'నా జేబులో వంద రూపాయల నోటు కూడా వుండదు.. నాకు డబ్బుతో పని లేదు..' అని చెబుతుంటారుగానీ, చంద్రబాబు కుటుంబానికి నిధులు సమకూరుతున్నది హెరిటేజ్ సంస్థ నుంచే. ఇక, పెరిగిపోయిన ఉల్లిధరలపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత చంద్రబాబుకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 'స్ట్రాంగ్' కౌంటర్ ఇచ్చారు.
హెరిటేజ్ ప్రస్తావనను తీసుకురావడం ద్వారా. దేశ వ్యాప్తంగా ఉల్లి ధరలు పెరిగాయనీ, ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే సామాన్యులకు కిలో ఉల్లిపాయలు 25 రూపాయలకు దక్కుతున్నాయనీ, ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తమ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసిందనీ చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఇదిలా వుంటే, 'హెరిటేజ్ మీది కానప్పుడు ఆ హెరిటేజ్ నుంచి బ్రాహ్మణి ఎలా బహుమతులు పంపుతున్నారు..' అంటూ అధికార పక్ష సభ్యులు చంద్రబాబుని నిలదీయడం గమనార్హం.