డెన్‌లో చెక్క పెట్టెలు, ఖాళీ డ్ర‌మ్ములు

ఫిబ్ర‌వ‌రి 11 స్మ‌గ్లింగ్ నిరోధ‌క దినం. స్మ‌గ్లింగ్‌, స్మ‌గ్ల‌ర్ ప‌దాల‌ని ప‌రిచ‌యం చేసింది సినిమాలే. 1940-60 వ‌ర‌కూ భ‌క్తి సినిమాలు, జాన‌ప‌దాలు రాజ్య‌మేలాయి. 60 నుంచి 73 వ‌ర‌కూ సాంఘికాలు. కుటుంబ బంధాలు, తోడికోడ‌ళ్ల…

ఫిబ్ర‌వ‌రి 11 స్మ‌గ్లింగ్ నిరోధ‌క దినం. స్మ‌గ్లింగ్‌, స్మ‌గ్ల‌ర్ ప‌దాల‌ని ప‌రిచ‌యం చేసింది సినిమాలే. 1940-60 వ‌ర‌కూ భ‌క్తి సినిమాలు, జాన‌ప‌దాలు రాజ్య‌మేలాయి. 60 నుంచి 73 వ‌ర‌కూ సాంఘికాలు. కుటుంబ బంధాలు, తోడికోడ‌ళ్ల అసూయ‌లు, ఇంటిని చ‌క్క‌దిద్దే హీరోలు. ఈ కథాంశాలు న‌డిచేవి. హీరోకి ఉదాత్త‌త‌, నీతి, నిజాయ‌తీ వుండేవి. అవినీతి స‌హించేవాడు కాదు. పేద‌ల ప‌క్షాన వుండేవాడు. 1973 నాటికి దేశంలో ప‌రిస్థితులు మారాయి. ఇందిరాగాంధీ పాల‌న పేద‌రికాన్ని పార‌దోల‌లేక‌పోయింది. బొంబాయిలో మాఫియా పెరిగింది. సినిమా క‌థ‌లు కూడా మారాయి. అంత‌కు ముందు క్రైమ్ సినిమాలు లేవ‌ని కాదు. ఉన్నాయి. అయితే నెగెటివ్ షేడ్స్‌తో ఉన్న హీరోని ఆరాధించ‌డం మెల్ల‌గా మొద‌లైంది. గ్యాంగ్ వార్స్‌లో పాల్గొనే హీరో అంటే ఇష్టం ఏర్ప‌డింది. దీవార్‌, డాన్ సినిమాల సూప‌ర్‌హిట్‌తో తెలుగులో కూడా మాఫియా డాన్ క‌థ‌లొచ్చాయి.

అప్పుడు విల‌న్లంటే రాజ‌నాల‌, స‌త్య‌నారాయ‌ణ‌, నాగ‌భూష‌ణం. త‌ర్వాత రావుగోపాల‌రావు వ‌చ్చాడు. అయితే చెక్క‌పెట్టెలు, ఖాళీ డ్ర‌మ్ముల డెన్స్‌లో కూచుని జ‌గ్గూ అని త్యాగ‌రాజుని పిలిచింది మాత్రం ఎక్కువ‌గా రాజ‌నాల‌, స‌త్య‌నారాయ‌ణే. నాగ‌భూష‌ణం, రావుగోపాల‌రావు సాఫ్ట్ విల‌న్లు.

రాజ‌నాల క్రూరంగా న‌వ్వుతూ డెన్‌లో ప‌నులు పుర‌మాయిస్తూ వుంటాడు. డెన్ నిర్మాణ‌మే విచిత్రంగా వుంటుంది. గోడ‌ల‌కి బ్లాక్ అండ్ వైట్ చార‌లుంటాయి. త‌లుపుల‌న్నీ ఆటోమేటిక్. బ‌ట‌న్ నొక్కితే తెరుచుకుంటాయి. కొన్ని డెన్స్‌లో ప్ర‌త్యేకంగా గ్యాస్ చాంబ‌ర్లు వుంటాయి. మోసం చేసిన వాన్ని అందులోకి తోస్తారు. చివ‌ర్లో హీరోకి కూడా ఈ ఏర్పాటు వుంటుంది. కానీ త‌ప్పించు కుంటాడు. హీరోని ఒక వేళ డెన్‌లో బంధిస్తే క‌మెడియ‌న్ పాట పాడి విడిపించుకుంటాడు. కొన్నిసార్లు క‌మెడియ‌న్ ఆడ‌వేషంలో కూడా వస్తాడు. ఆ రౌడీలు మ‌రీ వెర్రి బాగులోళ్లు. ఆడామ‌గా తేడా క‌నుక్కోలేరు కానీ, ఇంతింత మీసాలు, బుగ్గ మీద పులిపిరితో వుంటారు. వాళ్ల‌ని అన‌డం ఎందుకు. బాస్‌ల‌ది కూడా అదే స్టాండ‌ర్డ్‌. ఎన్టీఆర్ కోర మీసం, బుగ్గ‌న క‌త్తి గాటుతో వ‌స్తే పెద్ద‌పెద్ద డైలాగ్‌లు చెప్పే  నాగ‌భూష‌ణం గుర్తే ప‌ట్ట‌లేడు (దేశోద్ధార‌కులు). నెత్తిన విగ్గు, చేతిలో క‌ల్లు కుండ‌తో వ‌స్తే ప్రాస గుక్క తిప్ప‌కుండా మాట్లాడే రావుగోపాల‌రావు కూడా (వేట‌గాడు) ఎన్టీఆర్‌ని క‌ల్లు కొండ‌య్య అనుకుంటాడు.

క్ల‌బ్బులో జ్యోతిల‌క్ష్మి పాట వుందంటే అర్థం, అక్క‌డ‌ సూట్‌కేసు మార్చుకుంటార‌ని. వీళ్ల‌ని ప‌ట్టుకోడానికి కృష్ణ వ‌చ్చి, టైమ్ వేస్ట్ ఎందుక‌ని వ‌చ్చీరానీ స్టెప్స్ ఏవో వేస్తాడు. చివ‌ర్లో లోడ్ చేయ‌కుండా రివాల్వ‌ర్ పేల్చి పొగ కూడా ఊదుతాడు. న‌గ‌రాల్లో స్మ‌గ్లింగ్ అంటే బంగారు బిస్కెట్స్‌ మార్చుకుంటారు. అడ‌వి క‌థ అయితే ఏనుగు దంతాలు, గంధం , టేకు దుంగ‌లు (ఎర్ర‌చంద‌నం లేటెస్ట్‌). కృష్ణ కాలంలో డ్ర‌గ్స్ గురించి ర‌చ‌యిత‌ల‌కి తెలియ‌దు. పాలిష్డ్ విల‌న్ అయితే గోల్డ్, మొర‌టు విల‌న్ అయితే నాటుసారా. వీటికి అద‌నంగా దొంగ నోట్లు కూడా వుంటాయి. కొన్ని సినిమాల్లో విల‌న్ ర‌హ‌స్యాలు తెలిసిన జ‌ర్న‌లిస్టులుంటారు. 

జుబ్బా, పైజామా ధ‌రించి, భుజానికి మాసిపోయిన సంచితో తిరుగుతుంటారు. పోరాటం, శంఖారావం లాంటి పేర్లుతో ఒక తుప్పు ప‌ట్టిన ప్రెస్‌లో ప‌త్రిక‌ని అచ్చు వేస్తూ వుంటారు. విల‌న్ డ‌బ్బు పంపిస్తానంటే ఒప్పుకోడు. దాంతో పైకి పంపిస్తాడు. దేవానంద్ cid (1956) జ‌ర్న‌లిస్టు హ‌త్య‌తోనే స్టార్ట్ అవుతుంది. డెన్స్‌లో పెద్ద చెక్క పెట్టెలుంటాయి. దాంట్లో ఏముంటాయో అర్థ‌మ‌య్యేది కాదు. హోమ్‌వ‌ర్క్ చేయ‌లేని దుస్థితిలో వున్న‌ప్పుడు, ఆల్‌జీబ్రా అర్థం కాక విర‌క్తి పుట్టిన‌ప్పుడు, డ్రిల్లు క్లాస్ ఎగ్గొట్టి మ్యాట్నీకి వెళితే అయ్య‌వారు చావ‌బాదిన‌ప్పుడు నేరుగా వెళ్లి స్మ‌గ్ల‌ర్ల‌తో క‌లిసిపోదామ‌ని తీర్మానించుకునేవాన్ని. కానీ వాళ్లు ఎక్క‌డ వుంటారో తెలిసేది కాదు. మా వూరి హోట‌ళ్ల‌లో న‌ల్ల‌టి అద్దాల‌తో సూట్‌కేసులు మార్చేవాడు ఒక్క‌డూ క‌న‌ప‌డ‌లేదు.

మాది క‌ర్నాట‌క బార్డ‌ర్ కాబ‌ట్టి బియ్యం, శ‌న‌క్కాయ‌లు అక్ర‌మ ర‌వాణా వుండేది. ఒకాయ‌న్ని స్మ‌గ్ల‌ర్ అని చెప్పుకునేవాళ్లు. కానీ ఆయ‌న నుదుట బొట్టుతో, తెల్ల‌ని బ‌ట్ట‌ల్లో మైసూర్ శాండ‌ల్ సోప్‌లా వుండేవాడు. మా స్కూల్‌కి కూడా వ‌చ్చి గాంధీమీద ఉప‌న్యాసం ఇచ్చి చాక్లెట్లు కూడా పంచాడు. త‌ర్వాత రోజుల్లో రాజ‌కీయాల్లో చేరి లీడ‌ర్ కూడా అయ్యాడు.

స‌త్య‌నారాయ‌ణ‌లా గ‌ట్టిగా న‌వ్వి రివాల్వ‌ర్ గురిపెట్టి ఒన్ టూ త్రీ చెప్పేవాళ్లు విల‌న్లు కానీ, గాంధీ మీద స్పీచ్ ఇచ్చే వాళ్లు విల‌న్లు అవుతారా అనుకునేవాన్ని. వ‌య‌సు పెరిగే కొద్ది అర్థ‌మైంది మారువేషాల్లో వుండేది హీరోలు కాదు, విల‌న్లు అని.

జీఆర్ మ‌హ‌ర్షి