ప్రపంచవ్యాప్తంగా పఠాన్ ప్రభంజనం కొనసాగుతోంది. షారూక్ ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమా తాజాగా 900 కోట్ల రూపాయల క్లబ్ లోకి చేరింది. ఈ మేరకు యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ అధికారికంగా ప్రకటన చేసింది. వరల్డ్ వైడ్ పఠాన్ సినిమాకు 17 రోజుల్లో 901 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్టు వెల్లడించింది. అంతేకాదు, సినీ చరిత్రలోనే అత్యధిక గ్రాస్ సాధించిన హిందీ సినిమాగా పఠాన్ నిలిచినట్టు ప్రకటించుకుంది సదరు సంస్థ.
సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మూడో శుక్రవారం భారతదేశంలో 5.90 కోట్ల రూపాయల నెట్ వచ్చింది. మొత్తంగా ఈ సినిమాకు ఇండియాలో 558 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్టు అధికారికంగా ప్రకటించారు.
ఈ సినిమా సక్సెస్ పై షారూక్ స్పందించాడు. “ఇది సినిమాటిక్ అనుభూతి. కేవలం పెద్ద స్క్రీన్‌పై చూడాల్సిన చిత్రం. బిగ్ స్క్రీన్‌పై 2-3 సార్లు చూసిన తర్వాత మీరు OTTలో చూడవచ్చు. దర్శకుడు సిద్ధార్థ్ కంటే బాగా ఈ జానర్ ఎవరికీ తెలియదని నేను అనుకుంటున్నాను. నేను అతనితో మొదటిసారి పని చేశాను. ఇలాంటి సినిమాల గురించి ఆయనకు బాగా తెలుసు. నా మనసుకు దగ్గరైన యాక్షన్ సినిమా ఇది.” అంటూ రియాక్ట్ అయ్యాడు.
సల్మాన్ ఖాన్ ఏక్ థా టైగర్ (2012), టైగర్ జిందా హై (2017), హృతిక్ రోషన్ నటించిన వార్ (2019) తర్వాత యష్ రాజ్ బ్యానర్ నుంచి వచ్చిన నాలుగో స్పై-యాక్షన్ థ్రిల్లర్ ఇది.