బిగ్‌బాస్ సీజన్-5లో వార్ వన్‌సైడ్ అయినట్టు…రాహుల్ సిప్లిగంజ్ తేల్చి చెప్పాడు. అంతేకాదు, ఇంత వరకూ తానెవరికీ మద్దతు ఇవ్వనని చెబుతూ వచ్చిన ఆయన…అతని ఆటకు ఫిదా అయినట్టు ప్రకటించడం విశేషం.
బిగ్‌బాస్ సీజన్-3 విన్నర్‌గా రాహుల్ సిప్లిగంజ్ మంచి పాపులారిటీ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఈయన మంచి గాయకుడు కూడా. బిగ్‌బాస్ సీజన్-5 ముగింపు దశకు చేరుకోవడంతో కంటెస్టెంట్లు సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ షో విజేత ఎవరనే అంశంపై సోషల్ మీడియాలో విస్తృతమైన చర్చ సాగుతోంది. మొదటి నుంచి యూట్యూబర్ షణ్ముఖ్ పేరు ప్రధానంగా వినిపిస్తూ వచ్చినప్పటికీ, కాలం గడిచేకొద్ది పరిస్థితులు మారాయి.
షణ్ముఖ్, సిరి కలిసి అసలు ఆట వదిలేసి, తమ ఇష్టానుసారం వ్యవహరిస్తుండడం కూడా వారిపై ఓటింగ్ ప్రభావం పడుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయం వాళ్లకు అర్థమవుతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్లినట్టు… షణ్ముఖ్ మాట తీరు ప్రతిబింబిస్తోంది.
ఈ నేపథ్యంలో తెలుగు ప్రేక్షకులను సన్నీ ఆట ఆకట్టుకుంటోంది. ఏ మాత్రం అంచనాలు లేకుండానే సన్నీ రోజురోజుకూ ప్రేక్షకుల మనసును గెలుచుకుంటూ వస్తున్నట్టు కనిపిస్తోంది. తాజాగా రాహుల్ సిప్లిగంజ్ వెల్లడించిన అభిప్రాయం కూడా అదే చెబుతోంది.
ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాహుల్ సిప్లిగంజ్ రియాల్టీ షోపై తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా రాసుకొచ్చాడు. సన్నీ గేమ్‌కు ఫిదా అయినట్లు తెలిపాడు. అలాగే షోలో వార్ వన్‌సైడ్ అయిందంటూ హార్ట్ సింబల్ షేర్ చేశాడు.