ఏవండోయ్ విన్నారా…లోకేశ్‌కు ప్రాణ‌హాని!

లోకేశ్ ఏ ముహూర్తాన పాద‌యాత్ర మొద‌లు పెట్టారో కానీ, ఏ మాత్రం క‌లిసి రావ‌డం లేదు. టీడీపీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌లు బ‌లంగా ఉన్న చోట మాత్ర‌మే లోకేశ్ పాద‌యాత్ర‌కు జ‌నం వ‌స్తున్నారు. మిగిలిన చోట్ల…

లోకేశ్ ఏ ముహూర్తాన పాద‌యాత్ర మొద‌లు పెట్టారో కానీ, ఏ మాత్రం క‌లిసి రావ‌డం లేదు. టీడీపీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌లు బ‌లంగా ఉన్న చోట మాత్ర‌మే లోకేశ్ పాద‌యాత్ర‌కు జ‌నం వ‌స్తున్నారు. మిగిలిన చోట్ల తేలిపోతోంది. ఒక‌టికి రెండు సార్లు ఆలోచించి పాద‌యాత్ర మొద‌లు పెట్టి వుంటే బాగుండేద‌ని, ఇప్పుడు స‌క్సెస్ చేసుకోక‌పోతే ప‌రువు పోతుంద‌నే భావ‌న టీడీపీ నేత‌ల్లో వుంది.

వారి ఆవేద‌న అర్థం చేసుకోత‌గిందే. ఏదో ర‌కంగా లోకేశ్ పాద‌యాత్ర జ‌నంలో చ‌ర్చ‌నీయాంశం కావాల‌ని చంద్ర‌బాబు కోరుకుంటున్నారు. అలాంటి ప‌రిస్థితి ఉత్ప‌న్నం కాలేదు. ఈ నేప‌థ్యంలో టీడీపీ సీనియ‌ర్ నేత‌లు చిరు ప్ర‌య‌త్నం చేయ‌డం గ‌మ‌నార్హం. పాద‌యాత్ర చేస్తున్న లోకేశ్‌కు ప్రాణ‌హాని వుంద‌ని టీడీపీ నేత‌లు కొత్త ప‌ల్ల‌వి ఎత్తుకున్నారు. త‌మ ఆరోప‌ణ‌ల్ని నిజం అని న‌మ్మించేందుకు టీడీపీ సీనియ‌ర్ నేత‌లు రంగంలోకి దిగారు.

ఇవాళ గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్‌ను టీడీపీ పొలిట్‌బ్యూరో స‌భ్యులు క‌లిశారు. లోకేశ్‌కు ప్రాణ‌హాని త‌ల‌పెట్టే కుట్ర జ‌రుగుతోంద‌ని వారు గ‌వ‌ర్న‌ర్‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు అడుగ‌డుగునా అడ్డంకులు సృష్టిస్తున్నార‌ని, ప్ర‌జ‌ల‌తో మాట్లాడ కుండా మైక్‌ను లాక్కుంటున్నార‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. గ‌వ‌ర్న‌ర్‌కు ఫిర్యాదు చేసిన అనంత‌రం  నేతలు కొల్లు రవీంద్ర, నక్కా ఆనంద్ బాబు, బోండా ఉమా, వర్ల రామయ్య  మీడియాతో మాట్లాడారు.

మాజీ మంత్రి న‌క్కా ఆనంద్‌బాబు మీడియాతో మాట్లాడుతూ కామెడీ పండించారు. లోకేశ్ పాద‌యాత్ర‌ను పోలీసులు డ్రోన్ల ద్వారా ఫొటోలు, వీడియోలు తీసి వైసీపీ సోష‌ల్ మీడియా ఇన్‌చార్జ్ స‌జ్జ‌ల భార్గ‌వ్‌కు పంపుతున్నార‌న్నారు. ఈ దృశ్యాల ద్వారా భ‌ద్ర‌తా లోపాల‌ను గుర్తించి ప్రాణ‌హాని త‌ల‌పెట్టేందుకు కుట్ర‌లు ప‌న్నుతున్నార‌ని ఆయ‌న ఆరోపించ‌డం గ‌మ‌నార్హం. వ‌ర్ల రామ‌య్య మాట్లాడుతూ పోలీసుల‌ను స‌ర్క‌స్‌లో జోక‌ర్ల‌గా అభివ‌ర్ణించారు.