దివంగత ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు రోడ్డు ప్రమాద గండం ఏందో ఉన్నట్టుంది. ఇప్పటికే ఎన్టీఆర్ కుటుంబానికి చెందిన కొందరు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఇవాళ ఉదయం జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్-10లో నందమూరి తారక రామారావు కుమారుడు రామకృష్ణ ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో కారు ముందు భాగంగా బాగా దెబ్బతిన్నది. అదృష్టవశాత్తు ప్రమాదం నుంచి రామకృష్ణ సురక్షితంగా బయటపడ్డారు.
గతంలో 2009లో ఎన్నికల ప్రచారం ముగించుకుని జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్ వెళుతుండగా నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో జూనియర్ ఎన్టీఆర్ తీవ్రంగా గాయపడి, రోజుల తరబడి ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సోదరుడు నందమూరి జానకీరామ్ కూడా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు.
దీంతో రోడ్డు ప్రమాదాలపై జూనియర్ ఎన్టీఆర్ జనాన్ని చైతన్యపరిచే కార్యక్రమాలు చేస్తుంటారు. తమ కోసం ఎదురు కుటుంబ సభ్యులుంటారనే విషయాన్ని గుర్తించుకుని జాగ్రత్తగా గమ్యస్థానాల్ని చేరాలని జూనియర్ ఎన్టీఆర్ అనేక సందర్భాల్లో చెప్పిన సంగతి తెలిసిందే.
ఇదిలా వుండగా ఇవాళ ప్రమాదానికి గురైన రామకృష్ణ కారును అక్కడే వదిలేసి వెళ్లారు. ఎలాంటి ఫిర్యాదు లేకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు. అనంతరం డ్రైవర్ కారును తీసుకెళ్లినట్టు తెలిసింది. రామకృష్ణ సురక్షితంగా బయట పడడంతో నందమూరి అభిమానులు, కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.