ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు రాఘవరెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం అరెస్ట్ చేసింది. దీనిపై వైసీపీ నోరెత్తడం లేదు. ఇదే తెలంగాణలో సీబీఐ, ఈడీ అరెస్ట్‌లపై అక్కడి అధికార పార్టీ గగ్గోలు పెడుతోంది. బీజేపీని టార్గెట్ చేస్తూ, బీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా మాగుంట రాఘవరెడ్డిని ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇదే కేసులో కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత కూడా ఉన్నారు.
కవితను కూడా అరెస్ట్ చేసే క్రమంలోనే… కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందనే ప్రచారం జరుగుతోంది. కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును ఇటీవల హైదరాబాద్‌లో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని చెప్పేందుకే మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడిని అరెస్ట్ చేసినట్టు చెబుతున్నారు.
ఇదిలా వుండగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ కీలక నాయకుడు విజయసాయిరెడ్డి అల్లుడి అన్న శరత్‌చంద్రారెడ్డిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు. ఇప్పుడు ఏకంగా అధికార పార్టీ ఎంపీ కుమారుడిని అరెస్ట్ చేసినా, వైసీపీ నేత లెవరూ మాట్లాడ్డం లేదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు తమ నాయకులు పాల్పడి వుంటారని వైసీపీ నేతల ఉద్దేశమా? లేక ఇతరేతర కేసుల్లో మరింతగా ఉచ్చు బిగిస్తారనే భయమా? అనే చర్చకు తెరలేచింది. దీనికి సమాధానం వైసీపీ నేతలే చెప్పాల్సి వుంది.