టర్కీ విషాదం.. ఈ ఫొటో ఓ చేదు జ్ఞాపకం

టర్కీ సిరియా భూకంపం తర్వాత శిథిలాల గుట్టలు ఆ భయానక దృశ్యానికి సాక్ష్యంగా నిలిచాయి. ఆ శిథిలాల వద్ద సహాయక చర్యలు చూస్తున్నవారికి ఆ విషాద తీవ్రత ఏంటో అర్థమైంది. శిథిలాల కింద ఓ…

టర్కీ సిరియా భూకంపం తర్వాత శిథిలాల గుట్టలు ఆ భయానక దృశ్యానికి సాక్ష్యంగా నిలిచాయి. ఆ శిథిలాల వద్ద సహాయక చర్యలు చూస్తున్నవారికి ఆ విషాద తీవ్రత ఏంటో అర్థమైంది. శిథిలాల కింద ఓ గర్భిణి బిడ్డను ప్రసవించి తాను మరణించిందనే వార్త, ఆ బిడ్డను పట్టుకుని పరుగు పరుగున బయటకు వస్తున్న ఓ వ్యక్తి దృశ్యాలు కంటతడి పెట్టించాయి. ఇద్దరు తోబుట్టువుల ఫొటో కూడా వైరల్ అయింది.

ఇప్పుడు ఓ తండ్రి-కుమార్తె ఫొటో ప్రపంచవ్యాప్తంగా అందరికీ హృదయాల్ని కలిచివేస్తోంది. శిథిలాల కింద కూతురు, బయటకు ఆమె అరచేయి మాత్రమే కనపడుతోంది. ఆ శిథిలాల గుట్ట పక్కన తండ్రి, ఆమె చేతిలో చేయివేసి కూర్చున్నాడు. ఈ హృదయ విదారక దృశ్యాన్ని చూసిన ప్రతి ఒక్కరూ చలించిపోతున్నారు.

ప్రాణం ఉన్నా లేకున్నా ఆ చేయి వదలను..

టర్కీ భూకంపంలో కూలిపోయిన అపార్ట్ మెంట్ లో నివశిస్తుండేవాడు మెసుట్ హాన్సర్. భూకంపం జరిగిన సమయంలో ఆయన ఇంటిబయట ఉన్నాడు కాబట్టి ప్రాణాలు దక్కాయి. అయితే ఇంటిలో ఉన్న 15ఏళ్ల కుమార్తె ఇర్మాక్ మాత్రం శిథిలాల కింద చిక్కుకుంది. ఆమె చేయి మాత్రమే బయటకు కనపడుతోంది. రక్తబంధం కాబట్టి ఆ చేయిని గుర్తుపట్టాడు హాన్సర్.

శిథిలాల పక్కనే కూర్చుని ఆమె చేయి పట్టుకుని ఏడుస్తున్నాడు. ప్రాణం ఉందో లేదో తెలియదు కానీ ఆమె చేయి మాత్రం వదిలిపెట్టనంటూ అక్కడే కూర్చునాడు. అయితే శిథిలాల తొలగింపు అక్కడ అనుకున్నంత సులభం కాలేదు. అందుకే చాలా సేపు హాన్సర్ తన కుమార్తె చేయి పట్టుకుని అక్కడే ఉండిపోయాడు. ప్రాణం ఉందో లేదో తెలియదు, కనీసం లోపలి నుంచి చిన్న శబ్దం కూడా వినిపించలేదు. చేయి పట్టుకున్నా అందులో చలనం లేదు. అయినా కూడా హాన్సర్ ఆశ వదల్లేదు. తన కుమార్తె బతికే ఉంటుందనే ఆశతో, ఆమె చేయి వదల్లేదు. వణికించే చలిలో రాత్రిపగలు అలానే కూర్చుండిపోయాడు.

శిథిలాలు ఎప్పుడు తొలగిస్తారా, తన కుమార్తెను గుండెలకు హత్తుకోవాలనేది ఆయన ఆశ.

అల్టాన్ అనే కెమెరామెన్ భూకంప దృశ్యాలను చిత్రీకరించేందుకు వెళ్లాడు. అక్కడ కనపడిన హాన్సర్ ని ఫొటో తీశాడు. శిథిలాల కింద ఉన్న ఓ చేతిని ఆయన పట్టుకోవడం చూసి దగ్గరకు వెళ్లి వివరం అడిగాడు. కుమార్తె గురించి, తన దీనావస్థ గురించి హన్సర్ చెప్పిన విషయాలను అల్టాన్ ప్రపంచానికి తెలియజేశాడు.

హాన్సర్ తన కుమార్తె చేయి విడిచి పెట్టకుండా పట్టుకున్న ఫొటో అందరినీ కలచివేసింది. తండ్రి-కూతురు ప్రేమను చాటిచెప్పేలా ఉన్న ఆ ఫొటో టర్కీ విలయానికి ఓ చేదు జ్ఞాపకం. బాధాకరమైన విషయం ఏంటంటే.. ఆ చిన్నారి ప్రాణాలు దక్కలేదు.