ఏపీ ప్రభుత్వం తెచ్చిన ఓటీఎస్ పై ఇప్పుడు తీవ్ర చర్చ నడుస్తోంది. వన్ టైమ్ సెటిల్మెంట్ అనేది పూర్తిగా స్వచ్ఛందం అని ప్రభుత్వం పెద్ద పెద్ద ప్రకటనలిస్తోంది, మరోవైపు అధికారులకు టార్గెట్ పెడుతోంది. ఒక్కో వీఆర్వో తన పంచాయతీ పరిధిలో రోజుకి కనీసం 10 ఓటీఎస్ లు అయినా చేయాలి.
ఇదీ టార్గెట్. ఈ టార్గెట్ లు పొరపాటున ఫోన్లలో రికార్డ్ అయినా, పేపర్ స్టేట్ మెంట్ రూపంలో బయటకొచ్చినా.. ఇటీవల ఓ పంచాయతీ సెక్రటరీ సస్పెన్షన్ కి గురైనట్టు అందరూ బలవ్వాల్సిందే. ఇక్కడే అసలు సమస్య మొదలైంది, ప్రతిపక్షాలకు కూడా ఓ అవకాశం ఇచ్చినట్టయింది. ప్రతిపక్షం చేస్తున్న విమర్శలకు ప్రభుత్వమే పరోక్ష కారణం అవుతోంది.
ఓటీఎస్ అనేది మంచి పథకమే. గత బకాయిలన్నీ రద్దు చేసి అధికారికంగా రిజిస్ట్రేషన్ చేసిన ధృవీకరణ పత్రాన్ని ప్రజలకు అందిస్తారు. కానీ ఇప్పటికిప్పుడు 10-15 వేల రూపాయలు కట్టాలంటే అందరికీ సాధ్యమయ్యే పని కాదు. అందులోనూ ఎక్కడా ఏ బ్యాంక్ కూడా ఎప్పుడూ నోటీసులివ్వకుండా ఉన్నట్టుండి మీరు ఇంత బకాయి ఉన్నారు అని ప్రభుత్వం చెబితే ఒప్పుకోడానికి ఎవరూ సిద్ధంగా లేరు. డబ్బులు కట్టలేం, కావాలంటే ఇంటిని స్వాధీనం చేసుకోండి అని ఎదురు తిరుగుతున్నారు గ్రామస్తులు.
వీరికి అర్థమయ్యేలా చెప్పడం అధికారులకు తలనొప్పిగా మారింది. పోనీ చెబుదామని అనుకున్నా, ఆ ప్రయత్నం చేస్తున్నా కూడా ప్రభుత్వమే ప్రకటనల రూపంలో గండికొడుతోంది. ఓటీఎస్ స్వచ్ఛందమే, బలవంతం లేదు అని స్టేట్ మెంట్ ఇస్తోంది. గవర్నమెంటే అంత పెద్ద ప్రకటన ఇచ్చాక ప్రజలు ముందుకొస్తారా చెప్పండి.
నిజంగా ఇది మంచి పథకమే అయితే కరోనా టీకా లాగా అందరికీ నిర్బంధం చేయండి. మా అధికారులు వస్తారు అందరూ డబ్బులు కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోండి, ఫలానా తేదీలోపు చేయించుకోకపోతే మీ ఇళ్లను జప్తు చేస్తారని స్టేట్ మెంట్ ఇవ్వండి. లేదా దీనివల్ల సమస్యలు ఎదురవుతాయనుకుంటే అధికారుల మెడపై కత్తి తీసేయండి, స్వచ్ఛందంగా ముందుకొచ్చినవారి దగ్గరే డబ్బులు వసూలు చేయాలని చెప్పండి. ప్రజల దగ్గర మంచి అనిపించుకోడానికి ఉద్యోగులపై ఒత్తిడి పెంచితే మాత్రం చివరకు అది ప్రభుత్వానికే ముప్పు అని చెప్పుకోవాలి.
ఇది ఏ స్థాయిలో తీసుకున్న నిర్ణయమో, ముఖ్యమంత్రి దృష్టికి ప్రజలు, ప్రభుత్వ అధికారుల కష్టాలు వెళ్లాయో లేదో తెలియదు కానీ.. ప్రతిపక్షం మాత్రం దీన్ని బ్రహ్మాండంగా ఉపయోగించుకుంటోంది. గతంలో ఎప్పుడూ ఈ గృహ రుణాల గురించి పట్టించుకోని చంద్రబాబు కూడా.. మేం అధికారంలోకి వస్తే డబ్బులు కట్టాల్సిన పనిలేకుండానే ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేస్తామంటున్నారు.
ప్రజల్ని రెచ్చగొడుతున్నారు. ఈ దశలో వైసీపీ ప్రభుత్వం ఓటీఎస్ పై పంతానికి పోతే తనని తాను విలన్ చేసుకున్నట్టే. పోనీ ప్రజల దృష్టిలో మంచి అయ్యేందుకు స్వచ్ఛందం అని చెప్పినా.. అధికారులు ఒత్తిడికి లోనవుతారు, కచ్చితంగా ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచుకుంటారు. ఈలోగా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం మేలు.