పీఆర్సీపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక హామీ ఇచ్చారు. తిరుపతి పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రిని పలువురు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కాసేపటి క్రితం కలిశారు. వరద బాధితులను పరామర్శిస్తున్న జగన్‌కు కలిసిన ఉద్యోగ సంఘాల నాయకులు తమ సమస్యలను ఏకరవు పెట్టారు. డీఏల పెండింగ్, పీఆర్సీ అమలు అంశాల్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. పీఆర్సీ ప్రక్రియ పూర్తయిందని, పది రోజుల్లో ప్రకటిస్తామని ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు జగన్ స్పష్టమైన హామీ ఇచ్చారు. దీంతో ఉద్యోగ సంఘాల నాయకులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఇదిలా వుండగా ఓ పథకం ప్రకారం జగన్ ప్రభుత్వానికి ఉద్యోగులను వ్యతిరేకం చేసే ప్రక్రియ చాప కింద నీరులా సాగుతోంది. తమ సమస్యలను పరిష్కరించని పక్షంలో ఈ నెల 7 నుంచి ఉద్యమ బాట పట్టనున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. తమ సమస్యలపై సీఎం జగన్ నేరుగా స్పందించాలని ఉద్యోగ సంఘాల సంఘాల నాయకులు అంటున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో పీఆర్సీపై జగన్ స్పందించడంతో పాటు నిర్దిష్టమైన సమయం చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉద్యోగులతో తమ ప్రభుత్వం స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించాలని కోరుకుంటున్నట్టు అధికార పార్టీ పెద్దలు చెబుతున్నారు. పీఆర్సీ ఎంత అనేది తేలాల్సి వుంది.