ప్రాంతీయ పార్టీల అధినేతలతో వచ్చే చిక్కు ఇదే. వరసగా రెండు సార్లు నెగ్గగానే.. తమ ప్రాంతీయ పార్టీని జాతీయ పార్టీ అంటారు. తమను తాము జాతీయ నేతలకు అభివర్ణించుకుంటారు. తమ తనయులను జాతీయ ప్రధాన కార్యదర్శిని చేసేసుకుంటారు. ఇక ప్రధాని పీఠమే తరువాయి అనుకుంటారు. జాతీయ స్థాయిలో చక్రం తిప్పడం మొదలెట్టామంటారు. కట్ చేస్తే.. వీరి దృష్టి ఎప్పుడు ఢిల్లీపై పడుతుందో అప్పుడు సొంత గల్లీలో వీరికి ఎదురుదెబ్బలు మొదలవుతాయి.
మాయవతి, ములాయం, చంద్రబాబు, కేసీఆర్.. వీళ్లంతా ఏదో ఒక దశలో ఈ తరహాలో కలలు కన్న వారే. ఒక్కోరి ప్రయత్నాలు ఒక్కో స్థాయి వరకూ వెళ్లాయి. అయితే వీరందరికి భంగపాటు మాత్రం తప్పడం లేదు. ఇప్పుడు మమత ఈ విషయంలో కొత్త బిచ్చగత్తెగా మారారని స్పష్టం అవుతోంది.
కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడన్నట్టుగా ఇప్పుడు కాంగ్రెస్ నుంచి వచ్చే నేతలను చేర్చుకుని మమత ఏదో చేసేయాలని తెగ ఆరాటపడుతతోంది. మరి ఆమెది ఆశనా.. దురాశనా.. అని సామాన్యులు గొణుక్కోవాల్సిన పరిస్థితి తలెత్తెంది ఇప్పుడు!
2007లోనో, 2008లోనో యూపీలో ఎన్నికలు జరిగితే.. మాయవతి పార్టీ సంచలన విజయం సాధిస్తే, ఆ మరుసటి రోజు నుంచినే ఆమె తదుపరి లక్ష్యం ప్రధాని పీఠమంటూ భజన మొదలైంది. యూపీలో ఆమె ముఖ్యమంత్రిగా నెగ్గారు నిజమే. అయితే.. దాంతోనే ప్రధాని అయిపోతారా? అని అప్పుడు సామాన్యుడు అనుకున్నాడు. అయితే మీడియాకు, రాజకీయ పార్టీలకూ ఇవేం పట్టలేదు. మాయ దృష్టి ప్రధాని పీఠంపై అంటూ గప్పాటు కొట్టారు. కట్ చేస్తే.. ఆమె తర్వాతి ఎన్నికల్లో యూపీలో అధికారాన్ని పోగొట్టుకున్నారు!
ఆ సారి యూపీలో పాగా వేసిన అఖిలేష్ యాదవ్.. తన తండ్రిని ప్రధాని పీఠంలో కూర్చోబెట్టమే టార్గెట్ గా ప్రకటించుకున్నాడు తన పార్టీ కార్యకర్తల మధ్యన. యూపీలో తను, ఢిల్లీలో తండ్రి అన్నట్టుగా అఖిలేష్ కొన్నాళ్లు హల్చల్ చేశాడు. అయితే.. ఆ తర్వాతి ఎన్నికల సమయానికి తండ్రీ, కొడుకులే గొడవ పడ్డారు. అఖిలేష్ సీఎం సీటును కోల్పోయాడు. ఇప్పుడు మళ్లీ యూపీ పీఠం ఎక్కడానికి శ్రమిస్తున్నాడు. ఢిల్లీ ఊసు లేదు!
ఇక చంద్రబాబు.. ఈయనది మరో కథ. సొంత బలం కన్నా.. ఆ పార్టీ ఈ పార్టీ కలిసి తనను పీఠం ఎక్కించాలని చంద్రబాబు ప్రయత్నాలు చేశారు. గత ఎన్నికల సమయంలో బీజేపీకి మెజారిటీ రాని పక్షంలో.. కాంగ్రెస్ భుజాల మీదకు ఎక్కి, టీఎంసీ నెత్తిన కూర్చుని ఢిల్లీలో పీఠం ఎక్కాలని చంద్రబాబు ఏదో స్కెచ్ వేశారు. అయితే అది పారలేదు. సొంత రాష్ట్రంలో 23 సీట్లకు పరిమితం అయ్యారు. సొంత కొడుకును ఎమ్మెల్యేగా గెలిపించుకోలేకపోయారు చంద్రబాబు!
ప్రధాని పీఠం కోసం ఏవేవో లెక్కలేసి, అంతర్గత వ్యూహాలను రచించి, బహిరంగంగా ప్రకటనలు చేసుకుని.. గాయి గత్తర చేయిపోయి భంగపడ్డ వాళ్లు వీళ్లంతా. వీళ్ల హిస్టరీని చూస్తే.. మమతా బెనర్జీ వర్తమానంతో సరి తూగుతుంది.
కాంగ్రెస్ తో కలిసే ప్రసక్తి లేదని ఆమె స్పష్టం చేశారట. యూపీఏ లేదన్నారట. అయితే ఆమే వెళ్లి స్వయంగా కలిసిన శరద్ పవార్ మాత్రం.. దూకుడు తగ్గించుకోమన్నట్టుగా ఏదో చెప్పినట్టున్నాడు. శరద్ పవార్ కు ఏమీ ఆశ లేకపోలేదు. ఇలాంటి ప్రయత్నాలు ఎప్పుడో చేసి వెనక్కు తగ్గిన నేత ఆయన. తన అనుభవం మేరకు ఏదో చెప్పి ఉంటాడు. అయితే ఈ ఊపులో ఉన్న వారెవరూ పక్క వారి మాటలను పట్టించుకోరని వేరే చెప్పనక్కర్లేదు.
మేఘాలయలో పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, బిహార్ లో ఇద్దరు ముగ్గురు కాంగ్రెస్ నేతలను, గోవాలో నలుగురు ఎమ్మెల్యేలను చేర్చేసుకున్న మాత్రాన.. కాంగ్రెస్ పార్టీ దెబ్బ తింటుందేమో కానీ, మమత ఈ బలంతో పీఎం కాలేదు. పై పెచ్చూ మమత అడుగులు కాంగ్రెస్ ను మరింత వీక్ చేసి. బీజేపీని మరింత బలోపేతం చేసే దిశగా సాగినా పెద్ద ఆశ్చర్యం లేదు!