వల్లభనేని వంశీ.. నారా భువనేశ్వరికి సారీ చెప్పడం అనేది ఇవాళ రాజకీయాల్లో హాట్ టాపిక్. ఒకసారి కామెంట్ చేసిన తర్వాత.. దాదాపు నెలరోజులకు పైగా చాలా గట్టిగానే ఉన్న వల్లభనేని వంశీ.. ఒక చానెల్ డిస్కషన్ మనస్ఫూర్తిగా సారీ చెబుతా అని తేల్చి చెప్పారు.
ఈ క్షమాపణకు కేవలం కొన్ని రోజుల కిందట.. నానీ, వంశీ ఇద్దరూ కలిసి ప్రెస్ తో మాట్లాడినప్పుడు కూడా ఏమాత్రం మెత్తబడినట్టు కనిపించలేదు. కానీ.. ఒక్కసారిగా వంశీ పూర్తిస్థాయిలో క్షమాపణ కోరారు. భువనేశ్వరికి మాత్రమే కాదు.. చంద్రబాబు పేరు ఎత్తకపోయినా.. తన వ్యాఖ్యల వల్ల ఎవరెవరైతే బాధపడి ఉంటారో వారందరికీ కూడా ఆయన సారీ చెప్పారు.
దీని మీద చాలా చర్చ జరుగుతోంది. సుపారీకి భయపడ్డారా, కులబహిష్కరణకు భయపడ్డారా.. అని ఎందుకు సారీ చెప్పడానే విషయమ్మీద చాలా మంది రంధ్రాన్వేషణ చేస్తున్నారు గానీ.. నిజంగా నేను తప్పు చేశాను. ఆ ఫీలింగ్ తోనే క్షమాపణ అడుగుతున్నాను- అని వంశీ చెబుతోంటే చాలా మందికి దాన్ని ఒప్పుకోవాలని అనిపించడం లేదు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. మరో అంశం ఏంటంటే.. చానెల్ ఏర్పాటు చేసిన బిగ్ డిబేట్ లో వంశీ క్షమాపణ అడగడం అనేది యాదృచ్ఛికం కానే కాదుట. అది ప్లాన్డ్ అని తెలుస్తోంది.
ఒక్కసారి క్షమాపణ చెప్పదలచుకున్న తరువాత వంశీ సదరు చానెల్ వారిని ఆశ్రయించి తన ఉద్దేశాన్ని వారికి వివరించి సారీ చెప్పడానికి ఒక సందర్భాన్ని సృష్టించుకున్నారని సమాచారం. ఆయన సారీ కోసమే.. చానెల్ చర్చా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. స్కెచ్ ప్రకారం అనుకున్నట్టే.. చానెల్ లైవ్ లోకి వచ్చి వంశీ సారీ చెప్పేసి చేతులు కడిగేసుకున్నారు. అలా ఆ ఎపిసోడ్ ముగిసింది.
అందుకే వంశీని నమ్మడం కష్టం..
వంశీ సదరు లైవ్ లో తాను చాలా చాలా మనస్ఫూర్తిగా, పశ్చాత్తాపంతో క్షమాపణ చెబుతున్నట్లుగా జనాన్ని నమ్మించడానికి విపరీతంగా ప్రయత్నించారు. తప్పు చేశానని నాకు అనిపించింది కాబట్టే.. సారీ చెబుతున్నా అనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఆయన ఎంతో ప్రయత్నించారు. అయితే ఎలా నమ్మడం? వంశీ ఆ మాటలు చాలా చక్కగా వల్లించి ఉండొచ్చు గానీ వాస్తవం అయ్యే అవకాశం లేదు.
నిజంగా ఆయనలో పశ్చాత్తాపం పుట్టి ఉంటే.. ఆ పశ్చాత్తాపం పరాకాష్టకు చేరిన సమయానికి ఆయన స్వయంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి అందరినీ పిలిచి తన వైఖరి వెల్లడించి ఉండాల్సింది. అందరికీ ఆయన పశ్చాత్తాపం చాలా స్పష్టంగా తెలిసేది. ఒక చానెల్ చర్చ నిర్వహించి ఆయనను లైవ్ లోకి తీసుకున్నప్పుడు అప్పటికప్పుడు ఆయన క్షమాపణ చెప్పినంత మాత్రాన.. ఆ భావన ఆయనలో ఒరిజినల్‌గా పుట్టిన భావన అని నమ్మడం ఎలాగ?
వంశీ చెప్పినట్టుగా పశ్చాత్తాపం ఆయనను అంతగా దహించివేసి ఉంటే.. చానెల్ చర్చకు ఆహ్వానించే వరకు ఆయన ఎలా ఆగారు? అనేది మామూలు ప్రజలకు తలెత్తుతున్న సందేహం. అందుకే వంశీ మనస్ఫూర్తి క్షమాపణలను ఎవ్వరూ నమ్మడం లేదు.
పశ్చాత్తాపాన్ని ప్రకటించుకునే మార్గం ఇంకోలా ఉంటుందని.. వంశీ సారీ చెప్పిన తీరు.. ఏదో ఆపద్ధర్మంగా ఈ వ్యవహారానికి ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టడానికి మాత్రమే అన్నట్టుగా ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.