1983 నుంచి 2011 ల మధ్యన రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు గృహనిర్మాణానికి బోలెడంత డబ్బులు ఖర్చు పెట్టాయి. ఏపీ గృహ నిర్మాణ సంస్థ తరఫు నుంచి పేదలకు గృహనిర్మాణాలకు వేల కోట్ల రూపాయలను లోన్ల రూపంలో ఇచ్చారు. ఎన్టీఆర్ ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వాలు ఈ పథకాన్ని అమలు చేయడంలో ముందు వరసలో నిలిచాయి.
ఎన్టీఆర్ హయాంలో ప్రధానంగా బీసీలకు కాలనీలను కట్టించారు. బీసీలు, ఎస్సీలకూ అప్పుడు లబ్ధి పొందింది. చంద్రబాబు తొమ్మిదేళ్ల హయాంలో ఈ పథకం ఊసులో కూడా లేదు. నామమాత్రంగా కూడా ఆ పథకాన్ని అమలు చేయలేదు. ఇక వైఎస్ఆర్ సీఎం అయ్యాకా.. ఇందిరమ్మ ఇళ్లు భారీ ఎత్తున కేటాయించారు. ఈ పథకంలో లబ్ధిదారులు కేవలం బీసీలు, ఎస్సీలు, ఎస్టీలే కాదు.. పెద్ద ఎత్తున ఓసీలు కూడా ఈ పథకం లబ్ధి పొందారు. వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్లంతా ఈ ఇళ్లను పొందారు.
పల్లెల్లో పాత ఇళ్లను కూల్చి మరి ప్రభుత్వం ఇచ్చిన మొత్తానికి తమ వంతు డబ్బులు వేసుకుని ఇళ్లు కట్టుకున్నారు. ఒక్కో ఇంట్లో రెండు మూడు పేర్లతో ఇళ్లను పొంది జాయింటుగా భవంతిని కట్టుకున్న వాళ్లు కూడా ఉన్నారు! అన్నదమ్ములు, తల్లిదండ్రుల పేరిట ఇళ్లను పొంది.. ఒక్కోరికి నలభై వేల రూపాయల చొప్పున రుణం వస్తే.. లక్ష రూపాయల పై మొత్తంతో ఒక రకమైన ఇళ్లను కట్టుకున్న వాళ్లు ఏపీ వ్యాప్తంగా ఎంతో మంది ఉంటారు. ఇలాంటి వాటి విషయంలో ప్రభుత్వం కూడా చూసీ చూడనట్టుగా వ్యవహరించింది.
అంతిమంగా ప్రభుత్వం ఇచ్చింది రుణం. దాన్ని వాయిదాల పద్ధతిలోనో, కంతులుగానో చెల్లించాలి. అయితే.. అలాంటి విషయంలో ప్రభుత్వాలు ఎలాంటి శ్రద్ధా చూపలేదు. ప్రజలు కూడా ప్రభుత్వం ఇచ్చే డబ్బును తాము తిరిగి చెల్లించాలనే ఆలోచనతో ఎప్పుడూ లేరు. ఎన్టీఆర్ హయాంలో ఇచ్చింది అయినా, వైఎస్ఆర్ హయాంలో ఇచ్చిన నలభై వేలు, డెబ్బై వేల రూపాయలు అయినా.. అదంతా తమకు ఉచితంగా ఇచ్చిందే అన్నట్టుగా ప్రజలు భావించారు. అది రుణం అని తెలిసి కూడా.. దాన్ని కట్టిన వారు కనపడరు!
ఇక గృహనిర్మాణ సంస్థ తరఫు నుంచి అయినా లోన్ల వసూళ్లకు ఏమైనా ప్రయత్నాలు జరిగాయా అంటే.. అదీ లేదు! స్థలంతో సహా ఇళ్లను పొందిన వారు, తమ స్థలంలో ప్రభుత్వ ఇళ్లను కట్టుకున్న వాళ్లు.. ఇలాంటి వారు లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు అలాంటి వారికి వన్ టైమ్ సెటిల్ మెంట్ పథకాన్ని జగన్ ప్రభుత్వం పెట్టింది.
ఈ పథకం ఎందుకు పెట్టింది? నిధుల సమీకరణకా.. మరో దానికా అనేది కాసేపు పక్కన పెడితే, ఇప్పుడు వన్ టైమ్ సెటిల్ మెంట్ అవకాశం ఇవ్వకపోతే.. నామమాత్రంగా ఇప్పుడు ప్రభుత్వానికి వసూలు అవుతున్న డబ్బులు కూడా ఎప్పటికీ రావు!
ఇప్పుడు ఓటీఎస్ కు ముందుకు వస్తున్నది కూడా అర్బన్ ఏరియా లబ్ధి దారులే. అర్బన్ ఏరియాలో ఇందిరమ్మ ఇళ్లు వంటివి పొందిన వారు తమ పత్రాలను ప్రభుత్వం వద్ద తాకట్టు పెట్టారు. ప్రభుత్వం ఇచ్చిన డబ్బుతోనో, దానికి తోడు తమ వ్యక్తిగత డబ్బుతోనో ఇల్లు కట్టుకున్నారు.
పదేళ్ల కిందట, పన్నెండేళ్ల కిందట అలా ఇల్లు కట్టిన వారికి ఇప్పుడు ఆ ఇల్లు సొంతమే. అయితే పత్రాలు మాత్రం వారి వద్ద ఉండవు! దీంతో కొనుగోళ్లు అమ్మకాలకు కూడా ఛాన్సు లేకుండా ఉన్నారు. ఒకవేళ అమ్మాలంటే లోన్ క్లియర్ చేయాలి. తామే క్లియరెన్స్ కు వెళ్తే వడ్డీలు కలిపి తడిసిమోపెడు కావొచ్చు. దీంతో దాన్నలా వదిలేసి కూర్చున్నారు.
ఇప్పుడు ఓటీఎస్ వల్ల వీరు చాలా లబ్ధి పొందుతారు. అర్బన్, సెమీ అర్బన్ ఏరియాలో ఇళ్ల పథకం రుణాలను తీసుకున్న వాళ్లు ఇప్పుడు వన్ టైమ్ సెటిల్ మెంట్ కోసం క్యూలు కడుతున్నారు. అప్పట్లో నలభై వేలు, డెబ్బై వేలు రుణాలను పొందిన వారు ఇప్పుడు ఎంతో కొంత కట్టి సెటిల్ చేసుకుని తమ పత్రాలను తాము తీసుకెళ్లిపోతున్నారు.
అదే పల్లెటూళ్ల విషయానికి వస్తే.. ఈ మాత్రం కదలిక కూడా ఉండదని కచ్చితంగా చెప్పొచ్చు. ఎలాగూ స్థలం, పత్రాల విషయంలో పట్టింపు ఉండదు, అమ్మకాలు, కొనుగోళ్ల ఊసు ఉండదు. దీంతో గృహనిర్మాణ సంస్థ నుంచి రుణాలను పొందిన వారు కూడా అదంతా తమకు ఉచితంగా ఇచ్చిందే అన్నట్టుగా వ్యవహరిస్తారు. ఓటీఎస్ పథకానికి కూడా అక్కడ స్పందన ఉండదని కచ్చితంగా చెప్పొచ్చు. సెమీ అర్బన్, అర్బన్ లో మాత్రం ఉత్సాహంగా ప్రజలు కదులుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. ఏతావాతా.. ఇదీ ఈ పథకం వెనుక, ముందు కథ.
ఇది తెలుగుదేశం పార్టీకి సహజంగానే నచ్చడం లేదు. వన్ టైమ్ సెటిల్ మెంట్ చేసుకోవద్దని చంద్రబాబే పిలుపు ఇచ్చారు ఇప్పటికే. తాము అధికారంలోకి వస్తే.. ఈ రుణాలన్నీ మాఫీ అన్నట్టుగా ఏదో లీకు ఇస్తున్నారు. సెమీ అర్బన్ లో కూడా ఇప్పుడు సెంటు భూమి ఐదారు లక్షల రూపాయలు ఉంది. అలాంటప్పుడు అక్కడ ఇళ్లను కట్టుకున్న వారు ప్రభుత్వం నుంచి పొందిన రుణాన్ని ఎంతో కొంత తిరిగి చెల్లించడంలో తప్పేం లేదు.
మరి తెలుగుదేశం అధికారంలోకి వస్తుంది, రుణాలు మాఫీ అయిపోతాయనుకునే వారు ఇప్పుడు ఓటీఎస్ కు వెళ్లకపోవచ్చు. అయితే.. అవన్నీ జరిగే పనులేనా… ఇప్పుడు ఎంతో కొంత కడితే చాలనే పిలుపుకే ఎక్కువగా స్పందన ఉందని క్షేత్ర స్థాయిని గమనిస్తే స్పష్టం అవుతుంది.